ఆశా వర్కర్ల సమస్యలను, వారి పనితీరుపై, నియోజకవర్గంలో వారికి కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు ఏమేం చర్యలు తీసుకోవాలో తెలుసుకోవడానికి శనివారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ బాలంరాయిలోని లీ ప్యాలెస్ లో ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అంగన్వాడీ కేంద్రాలు ఎక్కడ అవసరం ఉన్నాయో తన దృష్టికి తీసుకువస్తే వాటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు.
కరోనా సమయంలో ఆశా వర్కర్ల సేవలు అమోఘమని, దేశ సైనికులు ఈ దేశానికి ఎంత సేవ చేస్తున్నారో మీ సేవలు కూడా అంతేనని వారిని అభినందించారు. గత ప్రభుత్వం ఆర్ధిక క్రమశిక్షణ పాటించకపోవడంతో వ్యవస్థ దెబ్బతిన్నదని, దానిని సరిచేసి ప్రజాపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో గాడిన పెడుతుందని, మీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రకాల ఆర్ధిక పరమైన విషయాల్లో అండగా ఉంటానని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మీ ఇబ్బందులు తొలిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే వారితో చెప్పారు


