Wednesday, July 24, 2024
spot_img
HomeTELANGANAబుగ్గారం సర్పంచ్ కి సస్పెన్షన్ షోకాజ్ నోటీస్

బుగ్గారం సర్పంచ్ కి సస్పెన్షన్ షోకాజ్ నోటీస్

ఎందుకు సస్పెండ్ చేయకూడదో తెలుపాలని ఆదేశాలు

మరింత సొమ్ము రికవరీ కి అధికారుల పాట్లు

షోకాజ్ నోటీస్ విషయం రహస్యంగా ఉంచడంలో ఆంతర్యం ఏమిటో…?

ఆలస్యంగా వెలుగు చూసిన షోకాజ్ నోటీస్ వైనం

చిక్కుల్లో పడుతున్న ఉన్నతాధికారులు

మంత్రి కొప్పుల ఈశ్వర్ కు మచ్చ తప్పదా అంటున్న పార్టీ శ్రేణులు

జగిత్యాల జిల్లా బుగ్గారం సర్పంచ్ మూల సుమలత కు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మరో షోకాజ్ నోటీస్ జారీ అయింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 37(5) ప్రకారం మిమ్మలను ఎందుకు సస్పెండ్ చేయకూడదో సంజాయిషీ తెలుపాలని అందులో ఆదేశించారు. ఆలస్యంగా ఈ షోకాజ్ నోటీస్ వ్యవహారం శనివారం వెలుగు లోకి వచ్చింది. గత సెప్టెంబర్ 25ననే ఈ నోటీస్ జారీ అయినట్లు తెలుస్తోంది. దుర్వినియోగం అయి రికవరీ చేయవలసిన రూ.16,163-00 లు జి.పి. ఖాతాలో జమ చేసి చాలాను ప్రతులు అందజేయాలని ఆ షోకాజ్ నోటీస్ లో ఆదేశించారు. అలాగే రూ.64,304-00 లు అభ్యంతర ఖర్చుగా పేర్కొంటూ వాటికి ఎలాంటి బిల్లులు, రికార్డులు సమర్పించ లేదని ఆ షోకాజ్ నోటీస్ లో పేర్కొన్నారు.

గత నాలుగు సంవత్సరాలుగా జిల్లా ఉన్నతాధికారులు ఈ నిధుల దుర్వినియోగాన్ని ఎలాంటి చర్యలు తీసుకోకుండా 2020 నుండి నాన బెడుతున్నారని ఆ షోకాజ్ నోటీస్ ( నం. ఎ3/1501/2020-పం) చూడగానే స్పష్టంగా అర్ధం అవుతోంది. గతంలో కూడా మూడు దపాలుగా అధికారులు బుగ్గారం జి.పి. నిధుల దుర్వినియోగం పై విచారణ జరిపారు. అమ్యమ్యాలకు ఆశపడి బయటపడ్డ దుర్వినియోగం అంతా కప్పి పుచ్చారని ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినా లక్షలాది రూపాయలు “నిధులు దుర్వినియోగం అయినట్లు గుర్తించిన అధికారులు రూ. 4,42,761 -00 లు రికవరీ” కూడా చేశారు. కానీ చట్టపరమైన చర్యలు తీసుకోవడం మాత్రం మరిచారు.

కోటికి పైగా నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు, అనేక పిర్యాదులు అందుకోవడం కూడా జిల్లా ఉన్నతాధికారుల, జిల్లా కలెక్టర్ ల వంతయింది. కానీ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. బుగ్గారం జి.పి. నిధుల దుర్వినియోగం విషయంలో జిల్లా ఉన్నతాధికారులు కూడా చిక్కుల్లో పడ్డట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాధ్యులైన 10 మంది అధికారుల మీద గ్రామస్తులు లిఖిత పూర్వకంగా పిర్యాదులు కూడా చేసినట్లు సమాచారం. భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న బుగ్గారం గ్రామ పంచాయతీ విషయం న్యాయస్థానాల మెట్లు ఎక్కడం, విజిలెన్స్ & ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల దాకా పిర్యాదులు వెళ్ళడం కూడా చర్చనీయాంశంగా మారింది. కాగా తాజాగా బుగ్గారం సర్పంచ్ మూల సుమలత శ్రీనివాస్ గౌడ్ లకు జారీ చేసిన షోకాజ్ నోటీస్ విషయం బయటకు పొక్కకుండా జిల్లా ఉన్నతాధికారులు రహస్యంగా ఉంచడంలో అంతర్యం ఏమిటి అని ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు.

ఏదో తూ.. తూ… మంత్రంగా మరింత సొమ్ము రికవరీ చేసేందుకే ఉన్నతాధికారులు తిప్పలు పడుతున్నట్లు సమాచారం. గత నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ న్యాయ పోరాటానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉన్నతాధికారులు ఎందుకు సరైన నిర్ణయం తీసుకోవడం లేదని, చట్టాలు ఎవరికీ కూడా చుట్టాలు కాదని, కాకూడదని బుగ్గారం ప్రజలు మండి పడుతున్నారు. ఇందులో బడా నేతల ప్రమేయం, వారికి కూడా వాటా ఉండవచ్చని ప్రజలు, ఉద్యమకారులు, మేధావులు, విద్యావంతులు, రైతులు, కూలీలు, ప్రతి పక్షాలు, ఏకంగా అధికార బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ముచ్చటించు కోవడం శోచనీయం. ఇలాంటి వారి వలన స్థానిక ఎమ్మెల్యే గా ఉన్న తెలంగాణ రాష్ట్ర మైనారిటీ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కూడా మాయని మచ్చ ఏర్పడిందని తెలిసింది. రానున్న ఎన్నికల్లో తగిన నష్టం కూడా కలుగక మానదేమోనని కొప్పుల ఈశ్వర్ అభిమానులు మదన పడుతున్నారు. ప్రజల్లో మంచి పేరున్న ఈశ్వర్ సార్ ఒకవేళ ఓటమి పాలైతే ఇలాంటి దుర్వినియోగం సంఘటనలే ప్రధాన కారణం అని ప్రజలు, ఈశ్వర అభిమానులు వారి – వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అందుకే నేమో బుగ్గారం జి.పి.లో భారీ గా నిధుల దుర్వినియోగం జరిగినా జిల్లా ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టర్, స్థానిక బడా నేతలు కూడా ఏమాత్రం స్పందించక పోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇప్పటికైనా బుగ్గారం జి.పి.లో భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ ప్రజాప్రతినిధులను, బాధ్యులైన వారందరినీ, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను తక్షణమే చట్టపరంగా, శాఖా పరంగా శిక్షించి, ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని బుగ్గారం ప్రజలు జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments