‘ధ్రువ’ స్పేస్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన రెండు నానో శాటిలైట్స్ విజయవంతంగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తంచేశారు. ఇస్రోకు చెందిన ‘పీఎ్‌సఎల్‌వీ-సీ 54’ ద్వారా హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ధ్రువ పంపిన ‘తై బోల్ట్-1’, ‘తై బోల్ట్-2’ అనే నానో ఉప గ్రహాల ప్రయోగం విజయవంతం కావడం దేశంలోని ఔత్సాహిక అంకుర సంస్థల చరిత్రలో సుదినంగా సీఎం పేర్కొన్నారు. ప్రైవేట్ రంగం ద్వారా ఉపగ్రహ ప్రయోగాల చరిత్రలో ఇదో మైలురాయి అని వ్యాఖ్యానించారు. టీ-హబ్‌లో పురుడుపోసుకున్న ‘స్కైరూట్’ స్టార్టప్ కంపెనీ ఇటీవలే ప్రయోగించిన ‘విక్రమ్-ఎస్’ శాటిలైట్ విజయవంతం కావడం ద్వారా దేశ ఉప గ్రహ ప్రయోగాల చరిత్రలో తెలంగాణ స్టార్టప్ కంపెనీ మొట్టమొదటి సంస్థగా చరిత్రను లిఖించిందని సీఎం గుర్తుచేశారు. ఇదే స్పూర్తితో తెలంగాణ యువత తమ మేధో సంపదను దేశ ప్రగతికోసం వెచ్చించి, భారత దేశ అభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు. శాస్త్ర సాంకేతిక.. ఐటీ రంగాల్లో ఔత్సాహికులైన యువతలో ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్‌ను, టీ-హబ్ సిబ్బందిని కేసీఆర్ అభినందించారు. కాగా, తైబోల్ట్1, తైబోల్ట్2 ఉపగ్రహాల ప్రయోగాలు విజయవంతం కావడంపై మంత్రి కేటీఆర్ ధ్రువ స్పేస్‌టెక్ స్టార్టప్ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ స్టార్టప్ వ్యవస్థాపకులను అభినందించారు.