ఆఫర్ కింద వస్తువులు తక్కువ ధరకు వస్తున్నాయంటూ ఫోన్ చేసి నమ్మించి నటి జీవితా రాజశేఖర్ నుంచి రూ.1.5 లక్షలు కాజేశాడో వ్యక్తి! ఆమె పరిచయస్తుల పేర్లు వరుసగా చెప్పడంతోనే జీవిత విశ్వసించి అతడు చెప్పిన ఖాతాలో గుడ్డిగా డబ్బు వేసినట్లు తెలిసింది. నిందితుడిని పోలీసులు చెన్నైకి చెందిన నరేశ్ అని, అతడు పాత నేరస్తుడు అని గుర్తించి అరెస్టు చేశారు. అతడికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో పరిచయాలున్నాయి. జియో ఆఫర్ కింద వస్తువులు, బహుమతులు తక్కువ ధరకే వస్తున్నాయని వారికి ఫోన్ చేసేవాడు. వారిని నమ్మించేందుకు సదరు ప్రముఖుల పరిచయస్తుల పేర్లను ఫోన్ నంబర్లతో సహా చెప్పి.. అప్పటికే వారూ తన నుంచి కొన్నారని చెప్పేవాడు. చెప్పిన మొత్తాన్ని వారు ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయగానే ఫోన్ స్విచాఫ్ చేసేవాడు. జీవితనూ అలాగే మోసం చేశాడు.