కర్ణాటకలో క్రమంగా ఎన్నికల వేడి పెరుగుతోంది. మే నెలలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇప్పటికే పాలక, ప్రతిపక్షాలు ప్రచారంలో తలమునకలవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అలనాటి నటి, కర్ణాటకలోని మండ్య స్వతంత్ర ఎంపీ సుమలతా అంబరీశ్ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి. సుమలతను బీజేపీలో చేర్చుకోవడం ద్వారా.. జేడీఎ్‌సతో పాటు కాంగ్రె్‌సనూ దెబ్బతీయొచ్చని కమలనాథులు అంచనా వేస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో మండ్యలోని తన నివాసంలో తన అభిమానులతో సుమలత శుక్రవారం కీలక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిణామానికి తోడు.. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎం కర్ణాటక ఎన్నికల బరిలోకి రావడం కాంగ్రె్‌సను ఆందోళనకు గురిచేస్తోంది. ఎంఐఎం రంగప్రవేశంతో తన మైనారిటీ ఓటు బ్యాంకుకు గండి పడుతుందని కలవరపడుతోంది. మహారాష్ట్ర, బిహార్, యూపీ, గుజరాత్ శాసనసభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తదితర పార్టీల విజయావకాశాలను ఎంఐఎం దెబ్బతీసిన సంగతి తెలిసిందే. 2018లో జేడీఎ్‌సకు మద్దతిచ్చిన ఎంఐఎం ఈసారి మైనారిటీల ప్రాబల్యం అధికంగా ఉన్న 20 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించింది.