కలిగింది మాట్లాడితే కంట్లో పుల్ల పెట్టినట్లు ఉంటుందట.. అనే సామెతలా మారింది నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పరిస్థితి. నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదన్న పాపానికి ఆయన పదవికి కత్తెరపడింది. వైసీపీ అధిష్ఠానం ఆయన్ను నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించింది. వెంకటగిరి నియోజకవర్గంలో నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డికి సహకరించాలని నెల్లూరు, తిరుపతి జిల్లాల ఉన్నతాధికారులకు సీఎం కార్యాలయం నుంచి లేఖలు అందాయి. ఎమ్మెల్యే ఆనం మాట వినాల్సిన పనిలేదని కూడా ఆ లేఖల్లో స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో వైసీపీకి ఆనం రామనారాయణరెడ్డికి ఎలాంటి సంబంధం లేదనే సంకేతాలను వైసీపీ అధిష్ఠానం వెల్లడించింది.
జగన్‌కు ఎదురు మాట్లాడితే.. ఆయన పాలనను ప్రశ్నిస్తే వేటు తప్పదన్న నానుడిని బలపరుస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే సీనియర్ నాయకుడిగా గుర్తింపు పొందిన ఆనం రామనారాయణరెడ్డిని అవమానకరంగా పార్టీ బాధ్యతల నుంచి తప్పించడం జిల్లాలో ప్రధాన చర్చనీయాంశం అయ్యింది. వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట వీరే నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్నారు. దీనికి భిన్నంగా వెంకటగిరిలో మాత్రం ఆనం రామనారాయణరెడ్డి నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జి పదవిని లాగేసుకున్నారు. నేదురుమల్లి రామ్‌కుమార్‌కు ఆ బాధ్యతలను అప్పగించి పొమ్మనకుండా పొగబెట్టినట్లు పార్టీ నుంచి బయటకు వెళ్లే పరిస్థితిని ఆనంకు కల్పించారు.
నిజాలు మాట్లాడినందుకా!?
ఇటీవల రెండు మూడు సందర్భాల్లో వెంకటగిరి అభివృద్ధి గురించి ఆనం రామనారాయణరెడ్డి వాస్తవాలను మాట్లాడారు. మూడున్నరేళ్లలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయామన్నారు. ఒక ఇల్లు కట్టామా..! రోడ్లలో ఏర్పడిన గుంతలపై తట్టెడు మన్ను పోశా మా..! జనం ఎందుకు ఓట్లు వేస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పింఛను ఇచ్చినంత మాత్రాన మనకు ఎందుకు ఓట్లు వేయాలి, మనకన్నా ముందు ప్రభుత్వాలు కూడా ఇచ్చాయి కదా..! అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలు వైసీపీ అధిష్ఠానానికి రుచించలేదని, అందుకే ఆయనపై వేటు వేశారని ప్రజలు చర్చించుకొంటున్నారు. ఈ పరిణామాలతో ఆనంకు వైసీపీతో బంధం తెగిపోయినట్లేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
భవిష్యత్ పరిణామాలపై చర్చ
వైసీపీ అధిష్ఠానం ఆనం రామనారాయణరెడ్డిపై వేటు వేసిన క్రమంలో జిల్లా రాజకీయాల్లో జరగబోయే భవిష్యత్ పరిణామాలపై చర్చ ఊపందుకుంది. వైసీపీ అధిష్ఠానం వ్యవహరించిన తీరుపై ఆనం ఎలా స్పందిస్తారు!? భవిష్యత్తులో రాజకీయంగా ఎలాంటి అడుగు వేయబోతున్నారు అనే అంశాలపై రాజకీయ వర్గాలు, ఇటు సామాన్య ప్రజల్లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.
రాపూరులో ఓ వర్గం సంబరాలు
రాపూరు మండలంలో వైసీపీలోని ఒక వర్గం మంగళవారం రాత్రి మూడు రోడ్ల కూడలిలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంది. వెంకటగిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా అధి ష్ఠానం ప్రకటించడంతో నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి వర్గీయులు బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకుంది