కనిపించకుండా పోయిన ఓ మహిళ.. ఇవాళ తెల్లవారుజామున ఇంటి సమీపంలోని పొదల్లో శవమై కనిపించింది. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం గన్నారం గ్రామం మండువకు చెందిన కమ్మరి గణపతి కమల దంపతుల కూతురు కమ్మరి రోజ (25)కు ఐదేండ్ల కింద వివాహం అయింది. ఈ క్రమంలో ఓ పాప పుట్టి చనిపోయింది. మూడేళ్ల కిందట కుటుంబ కలహాలతో రోజాకు విడాకులు అయ్యాయి. భర్తతో విడాకులు తీసుకున్న ఆమె తల్లి దండ్రుల వద్దే ఉంటూ జీవనం సాగిస్తుంది. నిన్న రాత్రి తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి రోజా కనిపించలేదు. కుటుంబీకులు, స్థానికులు రాత్రంతా వెతికారు. చివరకు తెల్లవారు జామున ఇంటి సమీపంలోని పెరట్లో ఉన్న పొదల్లో రోజా మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహంపై గొంతు నులిమినట్లుగా ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.