బళ్లారి: ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టవచ్చు. అది వారి హక్కు. కానీ ప్రజలు ఆ పార్టీ కి మద్దతు ఇస్తారా..? లేదా అనేది ముఖ్యం.. అని మాజీ ముఖ్యమంత్రి, సీఎల్‌పీ నేత సిద్దరామయ్య అభిప్రాయపడ్డారు. విజయనగర జిల్లాలోని హగరిబొమ్మనహళ్‌లో ఆయన మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులు గాలి జనార్ధన్ రెడ్డి కొత్త పార్టీపై ప్రశ్నించగా గతంలో కూడా రాష్ట్రంలో యడియూరప్ప, శ్రీరాములు, బంగారప్ప ఇలా ఎంతో మంది పార్టీలు పెట్టారు అవి ఏమైయ్యాయి. ఇదీ అంతే.. అని బదులిచ్చారు. గాలి పార్టీ గురించి ఏమీ మాట్లాడను అని దాటేశారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో నూటికి నూరు శాతం కాంగ్రెస్ పూర్తీ మెజార్టీతో విజయం సాధిస్తుందన్నారు. అనంతరం ఆయన అక్కడ ఉండే వలని డ్యాంలో వాయానం వదిలారు. అనంతరం గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. తాలూకాలోని వివిద గ్రామాల నుంచి పెద్ద ఎత్తున సిద్దరామయ్యను చేసేందుకు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సాయంత్రం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీ సీఎం మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం పూర్తీ కమీషన్ల ప్రభుత్వంగా మారిందన్నారు. ఐదేళ్ల అధికారంలో ప్రజలకు ఏమీ చేయలేదని అన్నారు, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా అఖండ మెజార్టీతో గెలుస్తుందని అని జోష్యం పలికారు. హేలీప్యాడ్ వద్ద సిద్దరామయ్యను మాజీ మంత్రి సంతోష్లాడ్, హగరిబొమ్మణహళ్ ఎమ్మెల్యే బీమ్లానాయక్, కంప్లీ ఎమ్మెల్యే గనేష్, బళ్లారి డీసీసీ అధ్యక్షుడు రఫీక్, విన్నట్ విల్లెన్ తదితర కార్యకర్తలు భేటీ అయ్యారు.