Saturday, May 18, 2024
spot_img
HomeTELANGANAబిజెపి అధికారంలోకి వస్తే దేశానికే ప్రమాదం: సిపిఎం రాష్ట్ర కమిటీసభ్యులు జే వెంకటేష్

బిజెపి అధికారంలోకి వస్తే దేశానికే ప్రమాదం: సిపిఎం రాష్ట్ర కమిటీసభ్యులు జే వెంకటేష్

కరీంనగర్ కోతిరాంపూర్ లోని ముకుందలాల్ మిశ్రా భవన్ లో వర్ణ వెంకటరెడ్డి అధ్యక్షతన సిపిఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జె.వెంకటేష్ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి దేశ సమగ్రతకు, సమైక్యతకు విఘాతం కలిగించే విధంగా మతోన్మాదాన్ని పెంచి పోషించిందని అన్నారు. నిత్యవసర సరుకుల ధరలు రోజురోజు పెంచుతూ పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని సర్వేలు బిజెపి, దాని మిత్రపక్షానికి 250 సీట్లు దాటవని చెబుతున్నా కానీ, తమ సొంత సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ కల్పితాలను జోడించి 400 సీట్లు వస్తాయని అబద్ధపు ప్రచారాలను చేస్తున్నారని బిజెపి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ శక్తులకు అమ్ముకుంటూ దేశ సంపదను దోచుకున్నారని అన్నారు.

బిజెపి అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలు కల్పించకపోగా ఉన్న ఉద్యోగాలనే ఊడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యంగా కులమతాల పట్టింపులు లేకుండా కలిసి, మెలిసి జీవిస్తున్న ప్రజల మధ్య భారత దేశ సాంప్రదాయానికి విఘాతం కలిగిస్తూ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం గడపడానికి బిజెపి ప్రయత్నిస్తుందని కార్పొరేట్ కంపెనీల దగ్గర ఎలక్ట్రోల్ బ్రాండ్ల రూపంలో కోట్లాది రూపాయలు తీసుకొని, వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ పేదలపై పన్నులు వేసి అడ్డగోలుగా దోచుకున్నారని బిజెపి వారికి దేశమంటే భక్తి లేదని కేవలం దేశభక్తి ముసుగులో దేశ సంపదను దోచుకుంటున్నారని దేశంలో మోడీ గ్రాఫ్ పడిపోయిందని పార్లమెంటు ఎన్నికల్లో 200 సీట్లు కూడా దాటదని అన్నారు.

సిపిఎం తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి స్థానంలో పోటీ చేస్తుందని మిగతా 16 స్థానాలలో ఇండియా కూటమికి మద్దతు ఇస్తామని తెలిపారు. దేశంలో మోడీకి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయని పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల రైతులు ఢిల్లీ కేంద్రంగా రెండు సంవత్సరాల పాటు నల్ల చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేశారని, రైతు ఉద్యమాలపై ఉక్కు పాదం మోపిన నరేంద్ర మోడీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా ఉన్న వారిని ఇడి, సి బి ఐ, సంస్థలను అడ్డుపెట్టుకొని అక్రమంగా జైల్లో వేస్తున్నారని మండిపడ్డారు. ఈవీఎం మిషన్లను ట్యాంపరింగ్ చేస్తూ వి.వి ప్యాడ్స్ ఓటింగ్ స్లిప్పులకు సరైన లెక్కలు రావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన నరేంద్ర మోడీ పరామర్శించలేదని, క్రికెట్ మ్యాచ్ లను గంటల పాటు వీక్షించడానికి టైం దొరికింది, కానీ మహిళా సమస్యలపై స్పందించలేదని అన్నారు. భారతదేశానికి బంగారు పథకాలు అందించిన మహిళా రెజ్లర్లపై బిజెపి ఎంపీ లైంగికంగా వేధించిన అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని, బిల్కిన్ భానో ను అత్యాచారం చేసిన దుండగులకు దండలు వేసి ఊరేగించిన నీచ చరిత్ర బిజెపిదని, బిజెపి హాయంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు

సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపిని ఓడించాలంటే ఉత్తర తెలంగాణలో బిజెపి కి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని, కరీంనగర్ లో బండి సంజయ్ ని చిత్తుగా ఓడించాలని, ఇండియా కూటమి అభ్యర్థికి తమ మద్దతు ఉంటుందని గడిచిన ఐదు సంవత్సరాలలో బండి సంజయ్ కరీంనగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచకుండా మత రాజకీయాలు చేశారని, కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయపబ్బం గడుపుకుంటున్నారని, కార్పొరేటర్ గా ఉన్నప్పుడు బండి సంజయ్ ఆస్తి ఎంత ఎంపిగా గెలిచిన తర్వాత అతను అక్రమంగా సంపాదించిన ఆస్తి ఎంత అని గ్రానైట్ మాఫియా లెవీ కట్టడం లేదని ఫిర్యాదులు చేసి ఆగ మేఘాల మీద ప్రెస్ మీట్ లు పెట్టి అక్రమార్కులను జైల్లో వేస్తామని చెప్పి, వారి దగ్గర వేల కోట్ల ముడుపులు తీసుకుని సైలెంట్ అయింది వాస్తవం కాదా? అన్నారు. కరీంనగర్ లో రైల్వే ఓవర్ బ్రిడ్జికి నిధులు లేకుండా, రైల్వే లైన్ కు అధిక నిధులు తేకుండా, స్థానిక సమస్యలను పట్టించుకోకుండా మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారనీ ప్రశ్నించారు.

మతోన్మాద బిజెపి వైఖరిని ఎండగడుతూ జిల్లా వ్యాప్త క్యాంపెయిన్ చేపడుతున్నామని, వామపక్షాల ఆధ్వర్యంలో జిల్లా సదస్సులు, బహిరంగ సభలు నిర్వహిస్తామని తెలిపారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బండి సంజయ్ ని ఓడించాలని, ఇండియా కూటమి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గిట్ల ముకుంద రెడ్డి, గుడికందుల సత్యం, జిమాసాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు యు.శ్రీనివాస్, సుంకరి సంపత్, ఎడ్ల రమేష్, జి.రాజేశం, నరేష్ పటేల్, శీలం అశోక్, మక్కపల్లి పూజ, నాయకులు జి తిరుపతి, కోనేటి నాగమణి, కొప్పుల శంకర్, పున్నం రవి, గడ్డం శ్రీకాంత్, కొంపల్లి సాగర్, సంపత్ రావు, గుండేటి వాసుదేవ్, రాయికంటి శ్రీనివాస్, సాయి, శ్రీరాముల నారాయణ, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments