అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా నిర్వహించినట్లుగానే ఈ సంవత్సరం కూడా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ శనివారం మడ్ ఫోర్డ్ లోని KJR వైస్రాయ్ గార్డెన్స్ లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ సోదరీమణులందరూ ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలలో పాలు పంచుకున్నారు. వేడుకలలో పాల్గొన్న సోదరీమణులు ఆట పాటలతో సంబరాలను అంబరాన్నంటించారు. ఈ వేడుకలలో పాల్గొన్న సోదరీమణులతో పాటు మహిళలందరికీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆటల పోటీలలో పాల్గొన్న వారందరికీ ఎమ్మెల్యే బహుమతులను అందజేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్ధికంగా బలపడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్రీ బస్ సౌకర్యం కల్పించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఎంచుకుని మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారని, ఎన్నో ఏళ్ల నుంచి తాను కూడా వ్యక్తిగతంగా మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంల ద్వారా శిక్షణ ఇప్పించానని, కంటోన్మెంట్ లోని ప్రతి మహిళ తనను తమ తోబుట్టువుగా భావించి ఎమ్మెల్యేగా గెలిపించారని, వారి ఋణం తీర్చుకోలేనిదని అన్నారు. మహిళలు ఆర్ధికంగా బలపడినప్పుడే కుటుంబాలు బాగుంటాయని, తద్వారా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని ఇదేవిధంగా భవిష్యత్తులో కూడా మహిళల అండదండలు తనకు అందించాలని అని మరొక్కసారి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


