ముంబై: అదానీ గ్రూపునకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎ్‌సఈ) మరోసారి షాకిచ్చింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్(ఏఈఎల్)తో పాటు అదానీ పవర్, అదానీ విల్మర్ షేర్లను అదనపు పర్యవేక్షణ చర్యల(ఏఎ్‌సఎం) జాబితాలో చేర్చింది. గురువారం నుంచే ఇది అమల్లోకి రానుంది. ప్రత్యేక పరిస్థితుల్లో ఆయా కంపెనీల షేర్లు తీవ్ర ఆటుపోట్లకు లోనై మదుపరులు నష్టపోకుండా చూసేందుకు స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు ఇలాంటి స్వల్పకాలిక చర్యలు తీసుకుంటాయి. నిజానికి హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో గత నెలాఖర్లో ఏఈఎల్ షేర్లను ఎన్‌ఎ్‌సఈ ఈ జాబితాలో చేర్చి బుధవారమే తొలగించింది. ఒక్క రోజు తిరక్కుండానే మళ్లీ ఈ షేర్లను ఏఎ్‌సఎం జాబితాలో చేర్చడం గమనార్హం.
అదానీలో వాటా పెంపునకు జీక్యూజీ ఆసక్తి
అదానీ గ్రూపులోని 4 కంపెనీల్లో పెట్టుబడులను జీక్యూజీ పార్ట్‌నర్స్ వ్యవస్థాపకుడు రాజీవ్ జైన్ సమర్థించుకున్నారు. అన్ని విషయాలు లోతుగా పరిశీలించాకే అదానీ కంపెనీల్లో రూ.15,446 కోట్ల విలువైన షేర్లు కొనాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కంపెనీల పనితీరు, ఆర్జనల ఆధారంగా అవసరమైతే మరిన్ని పెట్టుబడులకూ సిద్ధమన్నారు.
రూ.9 లక్షల కోట్లకు మార్కెట్ క్యాప్
అదానీ గ్రూపు కంపెనీల షేర్లలో ర్యాలీ బుధవారమూ కొనసాగింది. గ్రూపులోని 10 లిస్టెడ్ కంపెనీల షేర్ల మార్కెట్ విలువ బుధవారం రూ.9 లక్షల కోట్లకు చేరింది. గత 10 రోజుల్లోనే మార్కెట్ క్యాప్ రూ.2.48 లక్షల కోట్లు పెరగడం విశేషం. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు బీఎ్‌సఈలో 2.86 శాతం లాభంతో రూ.2,039.65 వద్ద ముగిశాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2.32 లక్షల కోట్లకు చేరింది. గత 6 రోజుల్లో కంపెనీ షేర్లు మదుపరులకు 70 శాతం లాభాలు పంచాయి. గ్రూప్‌లోని మిగతా కంపెనీల షేర్లూ లాభాల్లో ముగిశాయి.
రూ.4 లక్షల కోట్లు దాటిన అదానీ సంపద
షేర్ల వరుస ర్యాలీతో గ్రూప్ ప్రధాన ప్రమోటర్ గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద 5,210 కోట్ల డాలర్లకు (రూ.4.27 లక్షల కోట్లు) చేరింది.