క్రిమినల్ కేసులు అయినా సివిల్ కేసులంటూ భూకబ్జాదారులపై ఫిర్యాదులు స్వీకరించని మహబూబాబాద్ టౌన్ పోలీసులు. దీనితో న్యాయం అందక విలవిలలాడిపోతున్న పేదవాళ్లు. మహబూబాబాద్ కు చెందిన 93 ఏళ్ల వృద్ధునికి చెందిన స్థలాన్ని ఆక్రమించుకొని కొన్ని ఏళ్లుగా ముప్పు తిప్పలు పెడుతున్న భూకబ్జాదాలపై ఫిర్యాదు చేసినా, క్రిమినల్ కేసులు పెట్టకుండా వదిలేస్తున్న మహబూబాబాద్ టౌన్ పోలీసులు. మహబూబాద్ డీఎస్పీ, జిల్లా ఎస్పీ భూకబ్జాదారులపై ఉక్కు పాదం మోపాలని వేడుకుంటున్న మహబూబాబాద్ పేద ప్రజలు, బాధితులు.
మహబూబాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీ వెనుక 93 ఏళ్ల వృద్ధుడైన మహబూబాద్ పట్టణానికి చెందిన యూసుఫ్ అలీ ఖాన్ కు చెందిన 448 సర్వే భూమిని, సర్వే నంబర్ 447, 449 భూమి యజమానులు అక్రమంగా ఆక్రమించుకొని ప్లాట్లు చేసి అమ్ముకోగా, మరి కొందరు వ్యవసాయం చేసుకుంటున్న కారణంగా ఈ నెల 12వ తేదీన మహబూబాబాద్ మండల సర్వేయర్ సమక్షంలో చుట్టుపక్కల వాళ్లందరితో బాటు భూకబ్జా చేసిన భూకబ్జా దారులను సైతం పిలిచి వాళ్ళ సమక్షంలోనే సర్వే చేయించి సర్వేయర్ చూపిన హద్దులలో హద్దు రాళ్ళు పాతుకున్న సర్వే నంబర్ 448 భూమి యజమాని యూసుఫ్ అలీ ఖాన్.
సర్వే నెంబర్ 447 భూమి గల వ్యక్తులు యూసుఫ్ ఖాన్ కు చెందిన 448 సర్వే నెంబర్ భూమిని ప్లాట్లుగా చేసి విక్రయించిన విషయంపై ఈ నెల 20వ తేదీ నాడు మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన కుమారుడు అహ్మద్ ఖాన్ ఫిర్యాదు చేసిన తర్వాత, టౌన్ సి.ఐ.మహేందర్ రెడ్డి, ఎస్సై మౌనికని ఈ ఫిర్యాదు పై క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి, రిపోర్టు తయారు చేయవలసిందిగా ఆదేశించారు. టౌన్ సిఐ స్వయంగా ఆదేశించినా కూడా ఎలాంటి ప్రాథమిక విచారణ జరపకుండానే, ఫిర్యాదు దారున్ని విచారించకుండానే, ఎవరి మీదైతే ఫిర్యాదు చేశారో వారిని సైతం విచారించకుండానే, కనీసం వారిని పోలీస్ స్టేషన్ కు పిలవకుండానే ఫిర్యాదు దారునికి “ఇది క్రిమినల్ కేసు కాదు, సివిల్ కేసు అంటూ కోర్టులో కేసు వేసుకోమంటూ ఉచిత సలహా ఇస్తున్న టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు. ఒకరి వస్తువును వారికి తెలియకుండా దొంగిలించిన లేదా ఆక్రమించినా అది క్రిమినల్ కేసు అవుతుందన్న కనీస జ్ఞానం పొలిసు అధికారులకు ఉండదా? లేదా ముడుపులు తీసుకొని కేసును పక్కదారి పట్టిస్తున్నారా?
ఫిర్యాదు దారుడు చేసిన ఫిర్యాదుపై టౌన్ పోలీసులు స్పందించకపోవడం వల్ల రెచ్చిపోయిన భూకబ్జాదారులు మండల సర్వేయర్ చూపించిన స్థానంలో హద్దులుగా నిర్ణయించిన రాళ్లను పీకివేసి, 448 సర్వే నెంబర్ గల భూమిలో, 449 సర్వే నెంబర్ గల భూమి యజమాని వ్యవసాయం చేసుకొనుటకు భూమి చదును చేసి భూమి పైకి వస్తే మీ అంత చూస్తామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఫిర్యాదు దారుడు చేసిన ఫిర్యాదుపై సకాలంలో టౌన్ పోలీసులు స్పందించి, భూకబ్జాదారులపై చర్యలు తీసుకొని ఉంటే భూకబ్జాదారులు ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడేవారా?
భూకబ్జాదారుల నుండి అమాయకులను రక్షించాల్సిన పోలీసులు భూకబ్జాదారులపై కేసులు పెట్టకుండా పట్టించుకోకుండా వదిలేయడం వల్ల, వాళ్లు తిరిగి అక్రమాలకు పాల్పడుతు అమాయకుల పేదల ఆస్తులను కబ్జా చేస్తున్నారు. పోలీసుల సహాయ సహకారాలు లేకుండానే భూ కబ్జాదారులు బాహాటంగా అక్రమాలకు పాల్పడే అవకాశముందా? భూ కబ్జాదారుల నుండి పోలీసులకు రాజకీయనాయకులకు ముడుపులు అందుతున్నాయని అందుకే భూకబ్జాదారులు బరితెగించి పేదల భూములను కబ్జా చేస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. నిజమైన భూ యజమానులు తమ స్థలంలోకి వెళ్తే అక్కడ ఘర్షణలు జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ముడుపులు అందుకున్న పోలీసుల వలన పేద ప్రజల ఆస్తులకు ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని రక్షక భటులే భక్షక భటులవుతున్నారని చట్టాలు పేదలకు రక్షణ కల్పించడానికా లేక అక్రమార్కులకు అండగా ఉండేందుకా అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
నా ప్రాణం పోయినా పర్వాలేదు మేము త్వరలోనే భూమి పైకి మళ్ళీ వెళ్లి మా హద్దుల్లో రాళ్ళుపాతకుంటాం అంటూ యూసుఫ్ ఖాన్ కుటుంబ సభ్యులు అంటున్నారు. అక్కడ ఏమైనా ఘర్షణలు జరిగితే దానికి భూకబ్జాదారులు బాధ్యత వహిస్తారా? టౌన్ పోలీసులు బాధ్యతవహిస్తారా? ఆలోచించాలి. ఇప్పటికైనా మహబూబాబాద్ డిఎస్పి, జిల్లా ఎస్పీలు స్పందించి భూకబ్జాదారులపై ఉక్కు పాదం మోపి తమకు న్యాయం చేయాలని తాము ఇప్పటికి న్యాయ వ్యవస్థపై నమ్మకముంచి చట్టాలను గౌరవిస్తూ సహనంతో వ్యవహరిస్తున్నామని యూసుఫ్ ఖాన్ కుటుంబ సభ్యులు అంటున్నారు.
భూకబ్జాదారులపై రౌడీ షీట్ తెరిచి, వాళ్ళను రౌడీలుగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి భూకబ్జాదారులకు ఏ పార్టీకి చెందిన రాజకీయ నాయకులు కూడా సహకరించకుండా ఉండాలి. భూకబ్జాదారులకుసహకరించే రాజకీయ నాయకులు, పొలిసు అధికారులపై సైతం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉన్నది. ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం సడలితే ప్రభుత్వాలే కూలిపోతాయి. ప్రజల పనులతో జీతాలు తీసుకునే ప్రతి ప్రభుత్వాధికారి ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిందే. అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఎంతటివారైనా శిక్ష నుండి తప్పించుకోలేరని చరిత్ర చెబుతుంది.


