Monday, November 28, 2022
spot_img
HomeNATIONAL ప్రజా ప్రతినిధులు నోరు అదుపులో ఉంచుకోవాలి

 ప్రజా ప్రతినిధులు నోరు అదుపులో ఉంచుకోవాలి

న్యూఢిల్లీ : ప్రజా ప్రతినిధులు, మంత్రులు స్వీయ నియంత్రణతో పని చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది. దేశ ప్రజలను కించపరిచేవిధంగా, చులకనగా మాట్లాడకూడదని పేర్కొంది. ఇది రాతరూపంలో లేని నిబంధన అని స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగంలో అంతర్నిహితంగా ఉన్న కట్టుబాటు అని తెలిపింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది.

మంత్రులు, ప్రజా ప్రతినిధుల వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛలపై ఆంక్షలు విధించగలమా? అనే ప్రశ్నతో దాఖలైన పిటిషన్లపై ఈ ధర్మాసనం విచారణ జరిపింది. మంత్రులు, ప్రజా ప్రతినిధులు వివాదాస్పద, కించపరిచే వ్యాఖ్యలు చేసినపుడు, వారిపై ఆంక్షలు విధించడానికి తగిన అదనపు మార్గదర్శకాలను సుప్రీంకోర్టు జారీ చేయవచ్చునా? అనే అంశంపై తీర్పును రిజర్వు చేసింది. జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం ఈ విచారణ జరిపింది.

కించపరిచే వ్యాఖ్యలు చేయడం మానుకోవడాన్ని మన రాజకీయ సమాజానికి, పౌర సమాజానికి నేర్పించాలని పేర్కొంది. ప్రజా ప్రతినిధుల విషయంలో, మన రాజ్యాంగంలోని అధికరణ 19(2) ఏం చెప్తున్నప్పటికీ, బాధ్యతాయుతమైన పదవులను నిర్వహించేవారు విధించుకునే అంతర్నిహిత ఆంక్షలు లేదా పరిమితులు ఉన్నటువంటి రాజ్యాంగపరమైన సంస్కృతి మన దేశంలో లేదా? అని ప్రశ్నించింది. అది అంతర్నిహితంగా ఉందని తెలిపింది. కోర్టు ఈ విషయంలో ప్రవర్తన నియమావళిని జారీ చేయవలసిన అవసరం లేదని పేర్కొంది. ప్రభుత్వ పదవిని నిర్వహించే వ్యక్తికి లేదా పబ్లిక్ సర్వెంట్‌కు వర్తించే రాతరూపంలో లేనటువంటి నిబంధన ఉందని తెలిపింది. అది రాజ్యాంగ సంస్కృతిలో భాగమని తెలిపింది. బాధ్యతాయుతమైన పదవులను నిర్వహిస్తున్నపుడు విధించుకునే స్వీయ నియంత్రణ ఇది అని వివరించింది. దేశంలోని ఇతరులను చులకన చేసే, కించపరిచే వ్యాఖ్యలు చేయకుండా, ప్రేలకుండా విధించుకునే స్వీయ నియంత్రణ ఇది అని పేర్కొంది. దీనిని మన రాజకీయ, పౌర సమాజానికి నేర్పించాలని పేర్కొంది.

ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో 2016 జూలైలో జరిగిన సామూహిక అత్యాచారం కేసు బాధితులపై అప్పటి రాష్ట్ర మంత్రి అజం ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఈ పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో పిటిషనర్ భార్య, కుమార్తె అత్యాచారానికి గురయ్యారు. ఈ కేసు విచారణను ఢిల్లీకి బదిలీ చేయాలని, సామూహిక అత్యాచారం జరిగినట్లు వచ్చిన ఆరోపణలు రాజకీయ కుట్ర అని అజం ఖాన్ వ్యాఖ్యానించారని, ఆయనపై కేసు నమోదు చేయాలని పిటిషనర్ కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments