వసూల్‌ రాజా!

0
39

ఇప్పుడు… ఆ అధికారి చెప్పిందే శాసనం! ఆయన ఎవరిని, ఎప్పుడైనా, ఎక్కడికైనా మార్చేస్తారు. ‘ఎందుకు?’ అని అడిగితే… ‘మీరు సిస్టంతో పోటీపడొద్దు’ అనే సమాధానం వస్తుంది. ‘ఇదేం అన్యాయం?’ అని ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే… ‘గత ప్రభుత్వంలో మీరేం చేశారో తెలుసు!’ అనే హెచ్చరిక వినిపిస్తుంది. 

తనకన్నా సీనియర్‌ అధికారులైనా సరే… ఈ అధికారి చెబితే ‘ఎస్‌ బాస్‌’ అనాల్సిందే. ఏమాత్రం తేడా వచ్చినా… ఉన్న పోస్టు ఊడిపోతుంది. మళ్లీ కొత్తగా పోస్టింగ్‌ కావాలన్నా ఆయన శరణు కోరాల్సిందే. 

ఓ డిప్యూటీ కలెక్టర్‌కు ఇవ్వాల్సిన పోస్టును తన బంధువైన జూనియర్‌ అధికారికి అప్పగించారు. అంతటితో ఆగకుండా… మరో నాలుగైదు విభాగాలను కూడా అదనంగా కట్టబెట్టారు. ‘రుషికొండ’ను చక్కబెట్టేందుకు ఈ జూనియర్‌ అధికారిని ఇలా అందలమెక్కించినట్లు సమాచారం.

ఓ ఇంజనీరింగ్‌ విభాగానికి ఇంజనీరింగ్‌ చీఫ్‌గా ఎవరుండాలన్నది ఆ శాఖ ముఖ్యకార్యదర్శి, మంత్రి  నిర్ణయిస్తారు. కానీ… ఓ బడా కాంట్రాక్టర్‌ కోరగానే సీనియర్‌లను కాదని తన నమ్మినబంటును ఆ పోస్టులో కూర్చోబెట్టారు. తన మాట వినడం లేదని ఓ మాజీ మంత్రిని సైతం వివాదంలో ఇరికించారన్న ప్రచారం సాగుతోంది.

అమరావతిలో కొలువు! హైదరాబాద్‌లో దందా! చర్చలకు శ్రీనగర్‌ కాలనీలో ఒక అడ్డా! దోచింది దాచుకునేందుకు… కొండాపూర్‌ ప్రాంతంలో విల్లాలు! కరెన్సీని ఎంతని, ఎక్కడని దాచగలం! అందుకే… బంగారం, వజ్రాలపైనే మోజు! ఇదీ… రాష్ట్ర ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఒక అధికారి సాగిస్తున్న వసూళ్ల పర్వం! ముఖ్య నాయకుడి అండతో… చెలరేగుతున్న వైనం!ఆయన ఒక ఐఏఎస్‌ అధికారి! కేడర్‌ పరంగా… చాలామంది ఐఏఎ్‌సలకంటే బాగా జూనియర్‌. కానీ… ముఖ్య నేతకు ఆయనే ముఖ్యుడు! ఆయనకు అడ్డూఅదుపు లేదు. ఆయన మాటే శాసనం! మొత్తం బ్యూరోక్రాట్లలో ఆయనే ఇప్పుడు అత్యంత శక్తిమంతుడు! ప్రభుత్వ పెద్దలకు అవసరమైన పనులు చేస్తూనే… ‘స్వకార్యాల’ విషయంలో చెలరేగిపోతున్నారు. అడ్డగోలు సెటిల్‌మెంట్లు, దందాలు, వసూళ్లతో కోట్లకు కోట్లు పోగేసుకుంటున్నారు. బడా కాంట్రాక్టర్లు, ఐఏఎ్‌సలలో ఇప్పుడు ఈ ఐఏఎస్‌ అధికారి ‘వసూళ్ల పర్వం’పై భారీగా చర్చ నడుస్తోంది. 

 పోస్టింగ్‌ కింగ్‌…

రాయలసీమ జిల్లాలకు చెందిన ఆ జూనియర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రభుత్వ పెద్దలకు బాగా సన్నిహితుడు. ఆ ఒక్క కారణంతో రాష్ట్ర స్థాయిలో ముఖ్యమైన స్థానంలో కూర్చున్నారు. అధికారులకు  పోస్టింగ్‌లు మొదలుకొని కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల వరకు… కీలకమైన అంశాలపై సదరు అధికారిదే నిర్ణయం. ప్రభుత్వ నిర్ణయాలకు ఈయనే చోదక శక్తిగా చెబుతారు. ఆయన మాట చెప్పారంటే… జీవో వచ్చినట్లే! సహజంగా ఏయే శాఖలు ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలన్నది సదరు అధికారుల పనితీరు, ట్రాక్‌ రికార్డును బట్టి నిర్ణయిస్తారు. ఇక్కడ అలాంటిదేమీలేదు. ఆ ఐఏఎ్‌సను వ్యక్తిగతంగా ప్రసన్నం చేసుకొని… తనకు ఫలానా శాఖ కావాలని కోరితే చాలు! ఆ పనైపోయినట్లే! తన పరిధిలోని శాఖలు, ఇతర శాఖల్లో తన బంధువులు, సన్నిహితులను కీలక పోస్టుల్లో కొనసాగిస్తారు. వారి ద్వారా వ్యవహారాలు నడిపిస్తుంటారు.

ఆయన కనుసన్నల్లోనే…

ప్రభుత్వంలో ఏ శాఖ అయినా… ఆ శాఖకు అధిపతి ఎవరైనా… చక్రం తిప్పేది మాత్రం ఈ ముఖ్య అధికారే. సదరు శాఖల్లో ఏ కాంట్రాక్టు ఎవరికి దక్కాలో ఆయనే నిర్ణయిస్తారు.  ఎవరికి బిల్లు చెల్లించాలో, ఎవరికి ఆపాలో కూడా ఆయనే చెబుతారు. రాష్ట్ర స్థాయిలో భూములకు సంబంధించిన నిర్ణయాలతో ఈయనకు సంబంధం లేదు. అయినా సరే… అక్కడా వేలు పెడుతున్నారు. ప్రతిపక్ష నేతలు, దారికి రాని వారి భూములను నిషేధిత (22-ఏ) జాబితాలో చేర్పించడం ఆయన దినచర్యలో భాగం. అదే సమయంలో… తనను ప్రసన్నం చేసుకున్న వారికి సంబంధించిన భూములను.. ఎంత వివాదాస్పదమైనా సరే, నిషేధిత జాబితా నుంచి చకచకా తప్పించేస్తారు.  

పనేదైనా సరే… ‘పైసలే’

ఏ పోస్టుకు ఎంత రేటు, ఏ పనికి ఎంత ‘కమీషన్‌’ అనేది సారు డిసైడ్‌ చేస్తారు. తన దగ్గరికి వచ్చిన వారు కోరుకున్న పోస్టు ఏదైనా సరే… ఆయన సెట్‌ చేస్తారు. కాకపోతే… పరిస్థితులనుబట్టి రేటు మారిపోతుంది. అప్పటికే ఆ పోస్టులో ఎవరైనా సీనియర్‌ అధికారి ఉంటే… ఆయనను కదిలించేందుకు బాగా ఎక్కువ సమర్పించుకోవాలి. ఒకే అధికారికి ఒకటి నుంచి నాలుగైదు శాఖలకు ఇన్‌చార్జి, పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) లాంటివి అప్పగించాలంటే కళ్లుచెదిరే పేమెంట్స్‌ ఉంటాయని ఐఏఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భారీ ఆదాయం తీసుకొచ్చే విభాగాల్లో కనీసం రెండు మూడు విభాగాలకు ‘ఇన్‌చార్జి’గా నియమించాలంటే… పోస్టింగ్‌  ఇచ్చేటప్పుడు ఒక రేటు, ఆ తర్వాత ప్రతినెలా ‘మామూళ్లు’ ఉంటాయని తెలుస్తోంది.

హైదరాబాద్‌ అడ్డా…

శని, ఆదివారాలు వచ్చాయంటే… ఆ కీలక అధికారి హైదరాబాద్‌కు చెక్కేస్తారు. సెటిల్‌మెంట్లు, కలెక్షన్లకు హైదరాబాదే అడ్డా! పోస్టింగులు కావాలన్నా, బిల్లులు క్లియర్‌ చేయించుకోవాలన్నా, నిషేధిత జాబితా నుంచి తప్పించాలన్నా… అయ్యగారిని హైదరాబాద్‌లో కలవాలి. ఆయన అడిగింది సమర్పించుకోవాలి. అయితే… సెటిల్‌మెంట్లు, కలెక్షన్లకు రెండు వేర్వేరు కేంద్రాలున్నాయి. చర్చలు, సంప్రదింపుల కోసం  హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలో ఒక ‘అడ్డా’ ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. దోచుకున్నది దాచుకోవడానికి కొండాపూర్‌లో రెండు విల్లాలు ప్రత్యేకంగా కేటాయించినట్లు సమాచారం. ఈ దందాలను సదరు సారు కీలక బంధువు నిర్వహిస్తారు. ‘చర్చలన్నీ’ శ్రీనగర్‌ కాలనీలోని ‘కార్యాలయం’లో జరుగుతాయి. ప్రభుత్వంలో ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, మునిసిపల్‌, పలు శాఖల్లో ప్రాజెక్టులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు ఆర్థిక శాఖ పరిధిలో ఉంటాయి.

కానీ… ఈ కీలక అధికారి చెప్పిన బిల్లులు మాత్రమే ఆర్థిక శాఖలో క్లియర్‌ అవుతాయి. గత ప్రభుత్వానికి అనుకూలమనే ముద్రవేసి కొన్ని కంపెనీలు, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు పూర్తిగా నిలిపివేశారు. ‘మన వారు’ అనుకున్న వారికి మాత్రమే బిల్లుల చెల్లింపు జరుగుతుంది. అది కూడా… ఉత్తినే కాదండోయ్‌! బిల్లులో పదిశాతం ‘ముడుపు’ కట్టాల్సిందే. బిల్లుల చెల్లింపులకు 2 లేదా 3 శాతం వసూలు చేస్తేనే ‘అయ్య బాబోయ్‌’ అనుకునే వారు. ఇప్పుడు దానిని ఏకంగా 10 శాతానికి పెంచేశారు. ‘ఇప్పుడే ప్రభుత్వ పరిస్థితి ఇలా ఉంది. మున్ముందు ఎంత దిగజారుతుందో తెలియదు. పది శాతం పోయినా పర్లేదు’ అని కాంట్రాక్టర్లు భావిస్తున్నారు. ఈ పదిశాతంలో ఆరు శాతం ఓ పెద్దనేత ఖాతాకు చేరుతుంది. ఈ కీలక అధికారికి రెండున్నర శాతం దక్కుతుంది. మిగిలిన ఒకటిన్నర శాతం… ‘బేరాన్ని’ తీసుకొచ్చిన ‘బ్రోకర్‌’కు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యవర్తితో అవసరంలేకుండా… నేరుగా వచ్చే బేరాలైతే ఈ సారుకే 4 శాతం దక్కుతుంది.

కో… అంటే కోట్లు!

ఒకవైపు పోస్టింగుల కలెక్షన్లు, మరోవైపు బిల్లుల క్లియరెన్స్‌కు కమీషన్లు, ఇంకోవైపు భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించినందుకు ఇచ్చే కానుకలు…. ఇవన్నీ కలిసి రెండేళ్లలో ఈ కీలక అధికారి వందల కోట్లు పోగేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  అడ్డంగా సంపాదించిన సొమ్ముతో తన సొంత జిల్లాలో 460 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని తెలుస్తోంది. హైదరాబాద్‌ సమీపంలోని మేడ్చల్‌, శేరిలింగంపల్లి, కోకాపేట, కొండాపూర్‌ ప్రాంతాల్లో 120 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లుగా సమాచారం! ఇందులో తన సన్నిహిత బంధువును తెరమీద పెట్టి కోకాపేట ఏరియాలో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు నిర్వహిస్తున్నారని, అందులో కొందరు కాంట్రాక్టర్లతో పెట్టుబడులు పెట్టించారని అధికారవర్గాలు చర్చించుకుంటున్నాయి.

‘ఆయనను ఎవరూ ఏమీ చేయలేరు. చివరికి… ప్రభుత్వ పెద్దలే అనుకున్నా కదిలించలేరు. ఇదీ ఆయన పవర్‌’ అని సచివాలయంలో ఒక టాక్‌! పెద్దలకు సన్నిహితుడిగా వారికి అవసరమైన పనులు చేయడమే కాదు… తానూ సొంతంగా పొలిటికల్‌ లాబీయింగ్‌  చేస్తారని తెలుస్తోంది.

సొంత ‘ఖజానా’…

అక్కడా ఇక్కడా పెట్టుబడులు పెట్టినా…  చాలనంత సొమ్ములు ఈ కీలక అధికారికి వచ్చి పడుతున్నాయి. వీటిని దాచేందుకు కొండాపూర్‌ శిల్పారామానికి మూడు కిలోమీటర్ల దూరంలోని గేటెడ్‌ కమ్యూనిటీలోని రెండు విల్లాలను ‘సేఫ్‌ లాకర్లు’గా మార్చినట్లు తెలుస్తోంది. ముడుపులను కరెన్సీ రూపంలో ఇస్తే దాచుకోవడం కష్టమవుతుండటంతో… బంగారం, వజ్రాల రూపంలో తీసుకోవడం మొదలుపెట్టారు. దీనికి తనదైన శైలిలో ఒక ‘హవాలా’ మార్గం కనిపెట్టారు. సెటిల్‌మెంట్‌ పూర్తికాగానే… ఒక టోకెన్‌ ఇస్తారు. ‘ఫలానా నగల దుకాణానికి వెళ్లి ఈ టోకెన్‌ చూపించండి. మనం అనుకున్న డబ్బులు ఇచ్చేయండి. వాళ్లు ఇచ్చిన నగలు/వజ్రాలు తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వండి’ అని చెబుతారు. ఇటీవల ఓ సెటిల్‌మెంట్‌ చేసుకున్న ‘ముంబై పార్టీ’కి గురుగ్రామ్‌లోని ఓ ప్రముఖ నగల దుకాణం టోకెన్‌ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో పనులు చేస్తున్న ఒక కాంట్రాక్టర్‌ ద్వారా ఢిల్లీలోని ప్రముఖ నగల దుకాణం నుంచి వజ్రాలు, బంగారం తెప్పించారు. హైదరాబాద్‌ బేగంపేట్‌లోని మరో ప్రముఖ జ్యువెల్లరీకి కూడా ‘టోకెన్లు’ పోతుంటాయి. ఇలా వచ్చిన నగలు, వజ్రాలను కొండాపూర్‌ విల్లాలో దాచిపెడుతున్నట్లు సమాచారం. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.