వరిసాగు ఉల్టా పల్టా!

0
273

వరి సాగుపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు రైతులను అయోమయానికి గురి చేస్తున్నాయా? దీని ఫలితంగానే వానాకాలం సీజన్‌లోనూ వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిందా? అంటే.. అవుననే అంటున్నారు వ్యవసాయ రంగ నిపుణులు. గత యాసంగి సీజన్‌లో ‘వరి వేస్తే ఉరే’ అని, ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని, రైతులు వరి సాగు చేసినా.. ఒక్క గింజ కూడా కొనుగోలు చేసేది లేదని… పలు సందర్భాల్లో స్వయంగా సీఎం కేసీఆరే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ మాటల ప్రభావం వానాకాలం సీజన్‌పైనా పడుతోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది జూలై ఆఖరితో పోలిస్తే.. ఈ ఏడాది రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడం దీనికి బలం చేకూరుస్తోంది.

అంతర్జాతీయంగా బియ్యానికి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని వరి సాగును ప్రోత్సహించాలని కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఇటీవలే ప్రకటించారు. ఇదే అదనుగా వరి సాగు విస్తీర్ణాన్ని పెంచుకోవాల్సి ఉండగా.. రాష్ట్రంలో పరిస్థితి తిరోగమనం దిశగా కొనసాగుతోంది. వాస్తవానికి యాసంగి సీజన్‌లో వచ్చే ఉప్పుడు బియ్యాన్ని తీసుకునేందుకే కేంద్రం అభ్యంతరం చెబుతోంది. వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం సేకరణ విషయంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వానాకాలం సీజన్‌లో వరి సాగు తగ్గడం ఆందోళనకరమేనని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు. జూలై నెలాఖరు వరకు సాగు లెక్కలు పరిశీలిస్తే.. గత ఏడాది కన్నా ఈ సారి 9 లక్షల ఎకరాల మేర వరి సాగు విస్తీర్ణం తగ్గింది. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. 

అయోమయానికి కారణమేంటి?

వరి సాగుపై రైతుల్లో అయోమయం ఏర్పడడానికి ప్రొక్యూర్మెంట్‌ విధానమే ప్రధాన కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం వరకు రాష్ట్ర ప్రభుత్వం.. ‘రైతులు పండించిన ప్రతి గింజా కొంటాం!’ అనే ప్రకటన చేసేది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతుల ముంగిట్లోనే ధాన్యం కొనుగోళ్లు చేయడంతో.. రైతులకు మార్కెటింగ్‌ సమస్యలు లేకుండా పోయాయి. కనీస మద్దతు ధర కూడా లభించేది. దీనికితోడు వరి సాగులో యాంత్రీకరణ పెరిగిపోవటం, నాటు వేయటానికి మినహా కూలీల అవసరం లేకపోవడం, సులభంగా సాగు చేసే పంట కావటంతో.. వరి సాగుకే రైతులు మొగ్గు చూపారు. నీటి లభ్యత పెరుగుతున్న కొద్దీ.. వరి విస్తీర్ణాన్ని పెంచుతూ పోయారు.

అలా 2021- 22 వానాకాలంలో రికార్డు స్థాయిలో 61.95 లక్షల ఎకరాలకు విస్తీర్ణం పెరిగిపోయింది. కానీ, యాసంగికి వచ్చే సరికి రైతులు వరి సాగు చేసినా.. ఒక్క గింజ కూడా కొనుగోలు చేసేది లేదని స్వయంగా కేసీఆరే తేల్చి చెప్పడంతో.. రైతులు ఆందోళనకు గురయ్యారు. అంతకు ముందు సంవత్సరం 53 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే.. గత యా సంగిలో అది 36 లక్షల ఎకరాలకే పరిమితమైంది. గత ఆరు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ధాన్యం/బియ్యం పంచాయితీ కూడా వరి సాగుపై తీవ్ర ప్ర భావాన్ని చూపుతోంది. ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం, బియ్యం సేకరణకు కేంద్రం రకరకాల కొర్రీలు పెడుతుండటంతో రైతులు వరి సాగు చేయటానికి జంకుతున్నట్లు తెలుస్తోంది.

ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా వరి సాగును నియంత్రించాలని కంకణం కట్టుకుంది. 45 లక్షల ఎకరాలకే వరిని పరిమితం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించి.. వ్యవసాయశాఖ అధికారులకు దిశానిర్దేశం చేసింది. పత్తి సాగును 75లక్షల ఎకరాలకు పెంచాలని, ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తృతం చేయాలని నిర్ణయించింది. వరి సాగు ఎంత తగ్గితే.. సేకరణ విషయంలో అంత తలనొప్పి తగ్గుతుందనే భావనలో రాష్ట్రప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, వానాకాలంలో వరి సాగు తగ్గితే మాత్రం తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వానాకాలంలో పండించిన వరి బియ్యమే తింటారని గుర్తు చేస్తున్నారు.

అంతర్జాతీయంగానూ బియ్యానికి డిమాండ్‌ ఉందని కేంద్ర మంత్రి చెబుతున్న నేపథ్యంలో.. వరి సాగు తగ్గించేస్తే బియ్యం ధరలకు రెక్కలొచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. యాసంగిలో వరి సాగుకు బదులుగా… ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే ప్రయోజనమే ఉంటుందని పేర్కొంటున్నారు. యాసంగిలో రాష్ట్రంలో ఉత్పత్తి చేసే ధాన్యం నుంచి ఉప్పుడు బియ్యం మాత్రమే తీసుకునే అవకాశం ఉండడం, దేశవ్యాప్తంగా బాయిల్డ్‌ రైస్‌కు డిమాండ్‌ తగ్గిపోవడం వంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. పంజాబ్‌ తరహాలో వరి సాగుకు స్వస్తి చెప్పినా ఇబ్బందులేమీ ఉండవని అంటున్నారు.

నిరుడు 20 లక్షల ఎకరాలు..

గత ఏడాది వానాకాలంలో రికార్డు స్థాయిలో 61.95 లక్షల ఎకరాల్లో వరి సాగైన విషయం విదితమే! జూలై నెలాఖరు వరకు ఏకంగా 20 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. ఈసారి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వర్షాలు విస్తారంగా కురిసినా, చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు అలుగులు పోస్తున్నా, సాగుకు సరిపడా నీటి లభ్యత ఉన్నప్పటికీ.. రైతులు వరి సాగుకు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 11.12లక్షల ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు పడ్డాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది సుమారు 9 లక్షల ఎకరాల మేర తక్కువ. వరి సాగు చేసే ఇతర రాష్ట్రాల్లో సాగు విస్తీర్ణం పెరుగుతుంటే.. తెలంగాణలో మాత్రం తిరోగమన దిశలో కొనసాగుతోంది. ఇక ఆగస్టు 15 వరకు స్వల్పకాలిక రకాల సాగుకు అవకాశం ఉంది. నేరుగా విత్తనాలను వెదజల్లే పద్ధతిలో వరిసాగుకు కూడా మూడు వారాల సమయం ఉంది. దీంతో.. ఆగస్టులోనైనా వరి సాగు విస్తీర్ణం పెరుగుతుందా? లేదా? అనే చర్చ వ్యవసాయరంగ నిపుణుల్లో జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.