వందమందిలో ఒకడే… ఈ ‘అల్లూరి’

0
13

శ్రీవిష్ణు… పక్కింటి అబ్బాయిలాంటి పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌. ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘బ్రోచేవారెవరురా’, ‘రాజ రాజ చోర’లాంటి విజయవంతమైన చిత్రాలు తన ఖాతాలో ఉన్నాయి. ఎప్పుడూ ఏదో ఓ కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ, నటుడిగా ఎప్పటికప్పుడు కొత్త మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు. ఇప్పుడు ‘అల్లూరి’గా తన పౌరుషం చూపించడానికి సిద్ధమయ్యాడు. ఈనెల 23న ‘అల్లూరి’ విడుదలకు సిద్ధమైంది. ఈ స ందర్భంగా శ్రీవిష్ణుతో చిట్‌ చాట్‌.

తొలిసారి పోలీస్‌ పాత్ర చేశారు కదా? ఈ కథ చెబుతున్నప్పుడు మీకేం అనిపించింది?

నిజం చెప్పాలంటే… దర్శకుడు ప్రదీప్‌ వర్శ ఈ కథ చెప్పడానికి వచ్చేముందు నాకు ఇదో పోలీస్‌ కథ అని తెలీదు. తెలిసి ఉంటే… అసలు కథే వినకపోదును. ‘సరే వచ్చారు కదా.. విని ‘నో’ చెబుదాం’ అనుకొనే ఈ కథంతా విన్న తరవాత ‘నో’ చెప్పడానికి నా దగ్గర ఒక్క కారణం కూడా లేకుండాపోయింది. అంత బాగా నచ్చింది. ‘ఇంత పెద్ద కథ నామీద వర్కవుట్‌ అవుతుందా’ అనే భయం తప్ప మరో ఆలోచన లేదు. 

ఇప్పటి వరకూ కంఫర్ట్‌ జోన్‌లో కథలు ఎంచుకొంటూ వచ్చారు. ‘అల్లూరి’ కోసం అది దాటేశారనిపిస్తోంది. నిజమేనా?

నిజమేనండీ. కంఫర్ట్‌ జోన్‌లో ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. నా తరహా కామెడీ, క్రైమ్‌ సినిమాలు చేసుకుంటూ పోతే, జనం ఈజీగానే ఆదరిస్తారు. కానీ నాకు బోర్‌ కొట్టేస్తుంది. ఆ జోనర్‌ దాటి, రిస్క్‌ చేయాలనే ఉద్దేశంతోనే ‘అల్లూరి’ చేశా. ‘అల్లూరి’ పక్కా మాస్‌ సినిమా అండీ. స్ర్కీన్‌ ప్లే టెక్నిక్కులూ, ట్విస్టులూ ఉండవు. అందరికీ అర్థమయ్యేలా ఈ కథ చెప్పాం.

ఇంతకీ ‘అల్లూరి’ ఎలాంటి కథ..?

కృష్ణగారి ‘అల్లూరి సీతారామరాజు’లో ‘ఒక్క సీతారామరాజు చనిపోతే.. వందమంది సీతారామరాజులు పుడతారు’ అనే డైలాగ్‌ ఉంది కదా.? ఆ వంద మందిలో ఈ ‘అల్లూరి’ ఒకడు. నిజ జీవితంలో చాలామంది సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్లని  చూశాం. వాళ్లందరి జీవితాలూ ఈ కథకు స్ఫూర్తి. మనకు తెలిసిన పోలీస్‌ ఆఫీసర్లు, వాళ్లు ఎదుర్కొన్న పరిస్థితులూ, వాళ్ల పోరాటాలూ… ఇవన్నీ ఈ కథలో కనిపిస్తాయి.

ఈ కథకి సంబంధించిన రిసెర్చ్‌ ఏమైనా చేశారా?

దర్శకుడు పూర్తి స్ర్కిప్టుతోనే నా దగ్గరకు వచ్చాడు. చేయాల్సిన రిసెర్చ్‌ అంతా తానే చేసేశాడు. ఇందులో ‘అల్లూరి’ ఫిక్షనల్‌ పాత్ర కావొచ్చు. కానీ… జరిగిన సంఘటనలన్నీ యదార్థమే. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిజాయతీగా ఉంటూ, నిబద్ధతతో వ్యవహరించే ఓ పోలీసు కథ ఇది. ఈ సినిమా చూశాక పోలీసులపై గౌరవం పెరుగుతుంది. కనీసం యువతరంలో రెండు శాతమైనా ‘అల్లూరిలా నిజాయతీగా ఉందాం’ అనుకుంటారు.

మీ సినిమాల గురించి పెద్దగా మాట్లాడరు. కానీ ‘అల్లూరి’ గురించి మాట్లాడేటప్పుడు మాత్రం చాలా విశ్వాసం కనిపిస్తోంది. ఈ సినిమాపై ఎందుకంత ప్రేమ?

ఇందులో స్ర్టాటజీ ఏం లేదండీ. కొన్ని సినిమాలు చేసేటప్పుడే తెలిసిపోతుంది. ‘బ్రోచేవారెవరురా’కీ ఇలానే మాట్లాడాను. ‘రాజ రాజ చోర’కీ అంతే. నేను గట్టిగా మాట్లాడిన సినిమాలన్నీ బాగా ఆడాయి. ‘అల్లూరి’ కూడా అంతే. పేపర్‌ పై నేను చదివిన కథ… స్ర్కీన్‌పై కనిపించింది. అందుకే అంత నమ్మకం.

యువ హీరోలంతా పాన్‌ ఇండియా దిశగా ఆలోచిస్తున్నారు. మరి మీ మాటేంటి?

పాన్‌ ఇండియా అని కాదు కానీ.. త్వరలో యురేపియన్‌ సంస్థతో కలిసి ఓ సినిమా చేయబోతున్నా. మన తెలుగు దర్శకుడే రూపొందిస్తారు. చాలా పెద్ద ప్రాజెక్ట్‌ అది. పాపులర్‌ నటీనటులంతా ఉంటారు. ప్రస్తుతం స్ర్కిప్టు పనులు జరుగుతున్నాయి.

కొత్తగా ఒప్పుకొన్న సినిమాలేంటి?

మూడు ప్రాజెక్టులు ఒప్పుకొన్నా. హాసిత్‌ దర్శకత్వంలో ఓ సినిమా, సాయితో ఓ సినిమా, ‘హుషారు’ ఫేమ్‌ హర్షతో ఓ సినిమా చేస్తున్నా.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.