లోకాయుక్తకు చేరిన బుగ్గారం “పంచాయతీ”

0
56

జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై గత రెండున్నర ఏండ్లుగా కొనసాగుతున్న “బుగ్గారం పంచాయతీ” హైదరాబాద్ లోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆప్ “లోకాయుక్తకు చేరింది. జగిత్యాల జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లతో పాటు, జిల్లా పంచాయతీ అధికారి, జగిత్యాల డివిజనల్ పంచాయతీ అధికారులను కూడా బాధ్యులను చేస్తూ తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆప్ లోకాయుక్త ఆఫ్ తెలంగాణ లో పిర్యాదు చేసారు.

 ఈసందర్భంగా ఆయన గురువారం బుగ్గారం హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో గ్రామస్తులతో కలిసి విడిసి ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఆ సందర్భగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ సర్పంచ్ మూల సుమలత- శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ చుక్క శ్రీనివాస్ లతో పాటు, పంచాయతీ కార్యదర్శులను బాధ్యులైన అధికారులను కాపాడే ప్రయత్నాలలోనే జిల్లా ఉన్నతాధికారులు ఉన్నారని ఆరోపిస్తూ బుగ్గారం గ్రామపంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగంపై స్థానిక, జిల్లా అధికారులు కాకుండా ప్రత్యేక అధికారుల బృందంతో సమగ్ర క్షేత్రస్థాయి విచారణ చేపట్టి బాధ్యులందరి మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని ప్రజాధనాన్ని రికవరీ చేయాలని లోకాయుక్తకు పిర్యాదు చేసినట్లు తెలిపారు.

బాధ్యత గల హోదాలో ఉండి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా సమాచార హక్కు చట్టాన్ని కూడా ఉల్లంఘించి, నిధుల దుర్వినియోగంను ప్రోత్సహిస్తూ, ప్రజాధనం దుర్వినియోగం పై ఎలాంటి చర్యలు గైకొనని జగిత్యాల జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారులపై, బాధ్యులైన ఇతర అన్ని శాఖల అధికారుల మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లోకాయుక్తకు విజ్ఞప్తి చేశామన్నారు.

బుగ్గారం గ్రామపంచాయతీ ఖాతాల నుండి ప్రస్తుత సర్పంచ్ మూల సుమలత, ఉప సర్పంచ్ చుక్క శ్రీనివాస్ లు ఇప్పటివరకు రూ. 1,98 18,859 -00  (ఒక కోటి తొంభై ఎనిమిది లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల యాబై తొమ్మిది రూపాయల) నిధులు డ్రా చేశారని తెలిపారు. ఇందులో రూ. 1 కోటి నుండి కోటిన్నర వరకు నిధుల దుర్వినియోగం జరిగివుంటుందని చుక్క గంగారెడ్డి ఆరోపించారు. ఇవే కాకుండా పల్లె ప్రకృతి వనం పేరిట మరో ఐదు లక్షల యాబై వేల రూపాయలు దుర్వినియోగం జరిగిందని ఆయన పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా 2020 ఏప్రిల్ నెల నుండి ఈ దుర్వినియోగం పై గ్రామస్తులతో కలిసి తాను పోరాటం చేస్తున్నట్లు తెలిపారు.

పనులు చేపట్టకుండానే తప్పుడు తీర్మానాలు, దొంగ రికార్డులు, దొంగ బిల్లులు సృష్టించినట్లు ప్రజా సమక్షంలోనే అధికారుల విచారణ లో తేలిందన్నారు. పాలకవర్గం సహకారంతో, అధికారుల అండదండలతో, అధికార పార్టీ “అగ్రనాయకుల కనుసన్నల్లోనే” గ్రామ సర్పంచ్ మూల సుమలత, ఉప సర్పంచ్ చుక్క శ్రీనివాస్ లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి, ప్రజల నుండి వచ్చిన నిధులు వచ్చినట్లు వెంట వెంటనే మాయం చేస్తున్నారని ఆరోపించారు.

అధికారులకు, ఉన్నతాధికారులకు పిర్యాదుల మీద ఫిర్యాదులు చేసి ఏండ్లు గడిచినా రాజకీయంగా వచ్చిన ఒత్తిడి, పేరుకుపోయిన విచ్చలవిడి అవినీతితో బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, 2020 ఆగస్ట్ 24 నుండి విచారణ పేరుతో జిల్లా కలెక్టర్ సా….గ తీస్తున్నారని, ఉన్నతాధికారులు తూ.. తూ… మంత్రంగా రెండు సార్లు డిఎల్పీవో లచే విచారణ చేశారని రెండేండ్ల కిందే.. రూ. 16.14 లక్షలకు షోకాజ్ నోటీసులు ఇచ్చినా జిల్లా కలెక్టర్ గుగులోతు రవి నాయక్ తగిన చర్యలు తీసుకోలేదని సమాచార కమీషన్ ఆర్డర్ ను కూడా ఉన్నతాధికారులు లెక్కచేయని పరిస్థితి నెలకొందని  అయన మండిపడ్డారు.

ఈ విలేఖరుల సమావేశంలో గ్రామాభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ నక్క చంద్రమౌళి, వ్యవస్థాపక సభ్యులు పెద్దనవేని రాగన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపిటిసి నగునూరి చిన్న రామగౌడ్, మాజీ ఉప సర్పంచ్ నగునూరి పెద్దరామగౌడ్, విడిసి క్రియాశీలక కార్యవర్గ సభ్యులు విలాసాగరపు నందయ్య, గంజి రాజన్న, ఎండి అహ్మద్, కైలాస్ పతి, మామిడి హన్మంతు, బొడ్డు రవి, కేతి మల్లయ్య, లింగన్న తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.