తేజస్వీకి లైన్ క్లీయర్ చేసిన నితీశ్!

0
15

పాట్నా: జేడియూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆర్జేడీ అధినేత తేజస్వీయాదవ్‌కు అధికారం అప్పగించే ఆలోచనలో ఉన్నారా? ఆయన తాజా ప్రకటన చూస్తే అవుననే సమాధానం వస్తోంది. డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్ లాంటి యువతరం ముందుకు రావాలని నితీశ్ పిలుపునిచ్చారు. అదే సమయంలో తాను 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌‌లోని పూల్పూర్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తానంటూ వచ్చిన పుకార్లను కూడా నితీశ్ తోసిపుచ్చారు. 

జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా యత్నిస్తున్న నితీశ్ ఇప్పటికే అనేకమంది అగ్రనేతలను కలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జేడీఎస్ అధినేత కుమారస్వామి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, వామపక్షనేతలను నితీశ్ ఇప్పటికే కలిశారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని లాలూ ప్రసాద్ యాదవ్‌తో వెళ్లి కలవనున్నారు. మిగిలిన నేతలతోనూ కలిసేందుకు నితీశ్ యత్నిస్తూనే ఉన్నారు. 

జాతీయ రాజకీయాల్లో నిరంతరం బిజీగా ఉండేందుకు అవకాశం ఉండటంతో బీహార్‌లో పాలన బాధ్యతలు తేజస్వీకి అప్పగిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో అధికారం యువతరానికి అప్పగించేందుకు తనకు ఇబ్బందేమీ లేదని నితీశ్ సిగ్నల్స్ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నితీశ్ జాతీయ రాజకీయాలకు పరిమితమైతే తేజస్వీ సీఎంగా బీహార్ బాధ్యతలు చూసుకోవచ్చనే ఊహాగానాలు కొద్దిరోజులుగా వినవస్తున్నాయి. అయితే వాటికి మరింత ఊతమిచ్చేలా నితీశ్ మాట్లాడారని పరిశీలకులంటున్నారు. తేజస్వీకి అధికారం అప్పగించే తరుణం ఆసన్నమైందనే ప్రచారం మరింత ఊపందుకుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.