గహ్లోత్‌కే కాంగ్రెస్‌ పగ్గాలు!

0
14

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి, సీనియర్‌ నేత అశోక్‌ గహ్లోత్‌కు కట్టబెట్టాలని ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకోసం ఆయన్ను ఒప్పించారని.. ఈ నెల 28వ తేదీన ఆయన నామినేషన్‌  వేయనున్నట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్‌ కూడా బరిలోకి దిగనున్నారు. వీలైనంత ఎక్కువ మంది పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని సోనియా నిశ్చయించినట్లు తెలిసింది. ఇదే జరిగితే 1997 తర్వాత తొలిసారి గాంధీ కుటుంబేతరులే పోటీకి దిగినట్లు అవుతుంది. అలాగే పాతికేళ్ల తర్వాత ఆ పార్టీలో మొదటిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినట్లు అవుతుంది. అధ్యక్ష పదవికి పోటీచేయనని ఇప్పటికే అగ్ర నేత రాహుల్‌గాంధీ భీష్మించుకున్నారు. దీంతో సోనియా మళ్లీ బరిలోకి దిగవచ్చని వార్తలు వచ్చాయి. అయితే తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీచేయకూడదని వారిద్దరితో పాటు ప్రియాంకా గాంధీ వాద్రా కూడా నిర్ణయించుకున్నట్లు సమాచారం.

సోనియాకు వీరవిధేయుడైన గహ్లోత్‌ పేరు గత కొద్ది కాలంగా ప్రచారంలో ఉంది. అయితే సీఎం పీఠం వదిలి జాతీయ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆయన సుముఖంగా లేరు. అదీగాక రాజస్థాన్‌లో తన ప్రత్యర్థి సచిన్‌ పైలట్‌కు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టేందుకు సుతరామూ అంగీకరించడం లేదని అంటున్నారు. కొన్నాళ్లు తాను జోడు పదవుల్లో కొనసాగేందుకు అనుమతించాలని సోనియాను ఆయన కోరుతున్నట్లు తెలిసింది. అందరూ గట్టిగా ఒత్తిడి తెస్తే రాహుల్‌ మళ్లీ పగ్గాలు చేపడతారని గహ్లోత్‌ ఆశాభావంతో ఉన్నారు. అందుకే తాను అభ్యర్థిని కానని పదే పదే చెబుతూ వస్తున్నారు.

అధికారిక అభ్యర్థే..!

అధిష్ఠానం తరఫున అధికారిక అభ్యర్థి ఎవరూ ఉండరని పార్టీ ప్రకటించినప్పటికీ.. గహ్లోత్‌ అధికారిక అభ్యర్థేనని ఏఐసీసీ వర్గాలు అంటున్నాయి. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని చాటేందుకు గహ్లోత్‌పై ఎవరు పోటీచేసినా అడ్డుకోకూడదని.. తటస్థ పాత్ర పోషించాలని సోనియా, రాహుల్‌,  ప్రియాంక భావిస్తున్నట్లు సమాచారం. థరూర్‌ సోమవారం తనను కలిసినప్పుడు.. ఇదే విషయాన్ని సోనియా స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఇంకోవైపు.. ‘భారత్‌ జోడో యాత్ర’లో రాహుల్‌తో పాటు పాదయాత్ర చేస్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ హుటాహుటిన ఢిల్లీ చేరుకున్నారు. సోనియాతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో తమది తటస్థ పాత్ర అన్న సందేశాన్ని రాష్ట్ర శాఖలన్నిటికీ పంపాలని ఆయన్ను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో రాహుల్‌ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగే అవకాశాలు సన్నగిల్లినట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నా.. అలాగని పూర్తిగా కొట్టివేయలేమని.. పలు రాష్ట్రాల పీసీసీలు ఆయనే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించి అధిష్ఠానానికి పంపుతున్నాయని కొందరు సీనియర్‌ నేతలు గుర్తుచేస్తున్నారు. అయితే ఈ తీర్మానాల ప్రభావం పెద్దగా ఉండదని మరో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ చెప్పారు. ఎవరైనా పోటీ పడవచ్చని, కానీ వ్యక్తిగతంగా మాత్రం ఏకాభిప్రాయంతో ఎ న్నిక జరగాలనుకుంటున్నానని తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్చగా  జరుగుతాయని వేణుగోపాల్‌ అన్నారు.

సీతారాం కేసరి తర్వాత..

1997లో ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. సోనియా ఆశీస్సులు ఉన్న సీతారాం కేసరి.. శరద్‌ పవార్‌, రాజేశ్‌ పైలట్‌లను ఓడించి అధ్యక్షుడయ్యారు. 1998లో సీనియర్‌ నేతలు ఆయన్ను తొలగించి సోనియాకు కట్టబెట్టారు. 2000వ సంవత్సరంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సోనియాతో మాజీ ఉపాధ్యక్షుడు జితిన్‌ ప్రసాద పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఎన్నికలు జరుగనున్నాయి. 1998 నుంచి 2017 వరకు సోనియా అధ్యక్షురాలిగా కొనసాగారు. ఆ తర్వాత రాహుల్‌ పగ్గాలు చేపట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయం తర్వాత ఆయన రాజీనామా చేశారు. నాటి నుంచి సోనియా తాత్కాలిక సారథిగా కొనసాగుతున్నారు. కాగా అధ్యక్ష ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ విడుదలవతుంది. 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. పోటీ అనివార్యమైతే అక్టోబరు 17న పోలింగ్‌ జరుగుతుంది. 19న ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటిస్తారు.

థరూర్‌పై కేరళ నేతలు గుర్రు

అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసేందుకు శశి థరూర్‌ తహతహలాడడంపై ఆయన రాష్ట్రం కేరళకు చెందిన కాంగ్రెస్‌ నేతలు గుర్రుగా ఉన్నారు. రాహుల్‌గాంధీయే పగ్గాలు చేపట్టాలని పీసీసీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపితే.. ఆయన పోటీచేయాలనుకోవడం ఏమిటని ఆగ్రహంతో ఉన్నారు. నెహ్రూ కుటుంబ ప్రాధాన్యాన్ని గుర్తించే వారికే ఓటేస్తామని లోక్‌సభ ఎంపీలు కె.సురేశ్‌, కె.మురళీధరన్‌ స్పష్టం చేశారు. థరూర్‌ నిర్ణయం ఆయన వ్యక్తిగతమని.. పార్టీలో ఎవరితోనైనా ఆయన చర్చించారో లేదో తెలియదని.. అందుచేత ఆయన పోటీని సీరియ్‌సగా తీసుకోవలసిన అవసరం లేదని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.