ఆ సొమ్మెవరిది?

0
17

హైదరాబాద్‌: ఏపీలో రిజిస్ట్రేషన్‌! హైదరాబాద్‌లో కంపెనీలు! ఢిల్లీకి నిధులు! అది కూడా డొల్ల కంపెనీల ద్వారా! అంతేనా, పంజాబ్‌ ఎన్నికలకూ ఓ పార్టీకి రూ.200 కోట్లు హైదరాబాద్‌ నుంచే తరలింపు! ఆ కంపెనీలు ఎవరివి!? వాటి వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు!? ఆయా కంపెనీల ఆర్థిక మూలాలు ఎక్కడ!? తదితర వివరాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టి సారించింది. గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో వరుస సోదాలు జరుపుతున్న ఈడీ.. ప్రాథమిక విచారణలో హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటు చేసిన డొల్ల కంపెనీల ద్వారా ఢిల్లీ, పంజాబ్‌లకు వందల కోట్లు తరలించారని గుర్తించినట్లు తెలిసింది. ఆయా వ్యక్తులు, సంస్థల ఆర్థిక మూలాలను గుర్తించే పనిలో నిమగ్నమైంది.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీకి హైదరాబాద్‌ నుంచే పథకం రూపొందించినట్లు సీబీఐ నమోదు చేసిన అభియోగాలకు సంబంధించి ఆధారాలు సేకరించే పనిలో ఈడీ నిమగ్నమైంది. మనీ లాండరింగ్‌ కోణంలో విచారణ ప్రారంభించి వందల కోట్ల రూపాయల నగదు లావాదేవీలపైనే ప్రధానంగా దృష్టి సారించింది. సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితులకే పరిమితం కాకుండా నిధుల సమీకరణ, బదలాయింపులో కీలకంగా వ్యవహరించిన ఇతర వ్యక్తులను గుర్తించి వారి ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేసింది. పక్షం రోజుల్లోనే మూడుసార్లు సోదాలు జరిపి డొల్ల కంపెనీల ద్వారా ఢిల్లీకి నిధులు వెళ్లాయని ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఏ-14గా ఉన్న వ్యాపారి అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లైకి చెందిన రాబిన్‌ డిస్టిలరీస్‌, రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు రికార్డుల్లో పేర్కొన్న ప్రాంతాల్లో లేవని పూర్తి ఆధారాలతో గుర్తించింది.

ఇక, టీఆర్‌ఎస్‌ నాయకులకు అత్యంత సన్నిహితుడు, పిళ్లై సంస్థల్లో భాగస్వాములుగా ఉన్న వారి బంధువైన వెన్నమనేని శ్రీనివాసరావుకు చెందిన కొన్ని సంస్థలను ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్‌ చేసి హైదరాబాద్‌లో కొనసాగిస్తున్నట్లు ఈడీ బృందాలు గుర్తించాయి. అంతేనా, వరుస సోదాల్లో లభించిన ఆధారాలతో పదుల సంఖ్యలో డొల్ల కంపెనీలను గుర్తించినట్లు సమాచారం. వాటికి సంబంధించిన బ్యాంకు ఖాతాల లావాదేవీలు, ఈ కేసులో ఇప్పటి వరకు విచారించిన పలువురి వ్యక్తిగత, ఇతర ఖాతాల నుంచి గత కొన్ని నెలలుగా జరిగిన బ్యాంకు లావాదేవీల వివరాలను సేకరించే పనిలో ఈడీ అధికారులు నిమగ్నమయ్యారు. ఈ మేరకు ఆయా బ్యాంకులకు లేఖలు రాసినట్లు తెలిసింది. అంతేనా, ఆయా కంపెనీల పన్ను చెల్లింపు వివరాలు అందించాల్సిందిగా ఐటీ అధికారులకు లేఖలు రాస్తున్నారు.

ట్రావెల్‌ సంస్థలో కీలక ఆధారాలు

బంజారాహిల్స్‌లోని జోనా ట్రావెల్స్‌లో ఈడీ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి రాకపోకలు సాగించేందుకు ఈ ట్రావెల్స్‌ నుంచే విమాన టికెట్లు బుక్‌ చేసుకున్నట్లు గుర్తించారు. ట్రావెల్‌ సంస్థకు సంబంధించిన రమాసింగ్‌ అనే వ్యక్తిని ప్రాథమికంగా విచారించిన ఈడీ అధికారులు.. అవసరమైతే మరోసారి నోటీస్‌లు జారీ చేసి విచారించనున్నారు. తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, లిక్కర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు జోనా ట్రావెల్స్‌ నుంచే రాకపోకలు సాగించినట్లు గుర్తించిన ఈడీ అధికారులు అందుకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఢిల్లీలో భేటీకి హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానాల్లో రాకపోకలు సాగించారన్న కోణంలోనూ వివరాలు ఆరా తీస్తున్నారు.

త్వరలో సెకండ్‌ ఎపిసోడ్‌

సోదాల్లో లభించిన సాంకేతిక ఆధారాలు, పత్రాలను ఈడీ అధికారులు ఢిల్లీకి తరలించారు. ఇప్పటి వరకు అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లై, అభిషేక్‌రావు, ప్రేమ్‌సాగర్‌, ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబు తదితరులను విచారించిన ఈడీ బృందాలు వారు ఇచ్చిన సమాచారం, పత్రాల్లో ఉన్న వివరాలు, బ్యాంకు లావాదేవీలు తదితర అంశాలను పూర్తిస్థాయిలో విశ్లేషిస్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా అధికారులు వీటిని పరిశీలిస్తున్నారు. అనంతరం రెండో అంకానికి తెర లేవనుందని చెబుతున్నారు. మొదటి ఎపిసోడ్‌లో తనిఖీలు, విచారణ, ఆధారాల సేకరణకు పరిమితమైన ఈడీ రెండో ఎపిసోడ్‌లో అరెస్టుల వైపు అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

తదుపరి ఎవరు.. టెన్షన్‌.. టెన్షన్‌!

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి ఇప్పటి వరకూ పెద్దగా ఎవరికీ తెలియని వ్యక్తుల ఇళ్లు, సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. తద్వారా, ఊహించని రీతిలో కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని అంటున్నారు. సీబీఐ పేర్కొన్న నిందితుల జాబితాలో ఉన్న వారు కాకుండా వారి చుట్టూ ఉండి ఆర్థిక లావాదేవీలు చక్కబెడుతున్న వారిపై ప్రధానంగా ఫోకస్‌ పెట్టడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. దర్యాప్తు సంస్థలు అసలు తమ వరకు వస్తాయని ఊహించని వారి ఇంటి తలుపులు తట్టి ఆధారాలు సేకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే, కేంద్ర బృందాలు ఎప్పుడు, ఇంకెవరి ఇంటి తలుపు తడతాయోనని అటు రాజకీయ, ఇటు వ్యాపార ప్రముఖులు, వారి అనుచరులు టెన్షన్‌కు గురవుతున్నారు.

ఈడీకి తోడు ఐటీ!?

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఈడీతోపాటు ఐటీ శాఖ కూడా రంగంలోకి దిగనుందా!? అంటే ‘ఔను’ అనే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. లిక్కర్‌ స్కామ్‌లో విస్తృత సోదాలు నిర్వహించిన ఈడీ.. ఆయా కంపెనీల పన్ను చెల్లింపు వివరాలు అందించాలంటూ ఐటీ శాఖకు లేఖలు రాస్తోంది. అదే సమయంలో హైదరాబాద్‌ ఆదాయ పన్ను శాఖ ఇన్వెస్టిగేటివ్‌ విభాగం డైరెక్టర్‌ జనరల్‌ (డీజీఐటీ)గా ఉన్న వసుంధర సిన్హాను ముంబైకు బదిలీ చేశారు. అక్కడ ఆమెను ఆదాయ పన్ను శాఖ చీఫ్‌ కమిషనర్‌ (సీసీఐటీ)గా నియమించారు. ఏపీ, తెలంగాణ, ఒడిసా రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాలను ఇప్పటి వరకూ వసుంధర సిన్హానే పర్యవేక్షించారు. ఆమె సీనియర్‌ పోలీసు అధికారి, మాజీ సిటీ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ భార్య కావడం గమనార్హం. ఇక, ఆమె స్థానంలో సంజయ్‌ బహదూర్‌ను హైదరాబాద్‌లో డీజీఐటీగా నియమించారు. అలాగే, ఆదాయ పన్ను (ఐటీ) హైదరాబాద్‌ చీఫ్‌ కమిషనర్‌గా శిశిర్‌ అగర్వాల్‌ నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా సాధారణ బదిలీల్లో భాగంగానే ఈ మార్పులు జరిగినట్లు అధికార వర్గాలు చెబుతున్నా.. తెలుగు రాష్ట్రాల్లోని తాజా రాజకీయ పరిస్థితులు ఇందుకు కారణమనే విశ్లేషణలూ వెలువడుతున్నాయి. ఈడీకితోడు ఐటీ కూడా ఇకనుంచి దూకుడు ప్రదర్శించనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.