ఆస్ట్రేలియాలో పైచదువులు ప్లాన్ చేస్తున్నారా

0
13

ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకుంటున్న భారతీయుల సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. ప్రపంచంలోని టాప్ 100 యూనివర్శిటీల జాబితాలో ఆస్ట్రేలియా యూనివర్శీటీలు తరచూ చోటు దక్కించుకోవడమే ఇందుకు కారణం. అయితే.. విదేశాల్లో చదువుకోవాలనే వారు ముందుగానే అక్కడ ఖర్చులు ఎలా ఉంటాయో ఓ స్పష్టమైన అంచనాకు రావాలని అనుభవజ్ఞులు చెబుతుంటారు. చదువులకయ్యే ఖర్చుతో పాటూ జీవన వ్యయాలపై కూడా మంచి అవగాహన ఉండాలంటారు. అంతేకాకుండా.. నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటూ డబ్బు సిద్ధం చేసుకోవాలంటారు. 

గత కొద్ది సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో ద్రవ్యోల్బణం క్రమంగా పెరుగుతోంది. కరోనా సంక్షోభం తరువాత..పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. 2021 జూన్ నుంచి ఈ ఏడాది జూన్ మధ్య కాలంలో ద్రవ్యోల్బణం ఏకంగా 6.1 శాతం పెరగడం ఆందోళన కారకమేనని నిపుణుల అంటున్నారు. దీని వల్ల యూనివర్శిటీ ఫీజులపై ఇప్పటికిప్పుడు ప్రత్యక్ష ప్రభావం ఏమీ లేకపోయినప్పటికీ.. ఇతరత్రా రోజువారీ ఖర్చుల పెరుగుతాయనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. విదేశీ చదువులపై చేసే ఖర్చులో జీవన వ్యయాల పాత్ర చాలా కీలకమైనది. పచారీ సామాన్లకయ్యే ఖర్చు, వారంతంలో సినిమా షికార్లు, ఫోన్, ఇంటర్నెట్, ఇంటి అద్దెలు, ప్రజారవాణాపై చేసే వ్యయాలన్నీ ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతాయి. వీటన్నిటిపై ఓ స్పష్టమైన అవగాహన రావడం ఎంతో ముఖ్యం. 

ఆస్ట్రేలియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోం ఎఫెయిర్స్ లెక్కల ప్రకారం.. నలుగురు ఉన్న ఓ కుటుంబం  సగటు నెలవారీ ఖర్చు 6,883 ఆస్ట్రేలియన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఇది సుమారు రూ. 3.68 లక్షలు. ఇక..ఒక్కో వ్యక్తి నెలవారీ ఖర్చు రూ.1.97 లక్షలు. అమెరికాతో పోలిస్తే ఆస్ట్రేలియాలో చదువుకయ్యే ఖర్చు తక్కువగా ఉన్నప్పటికీ..ఆస్ట్రేలియాలో జీవన వ్యయం ఎక్కువ. అయితే..ఖర్చుల భారం తగ్గించుకోవాలనుకునే విద్యార్థులు అక్కడే పార్ట్‌టైంగా ఉద్యోగం చేసుకోవచ్చు. 

ఉద్యోగం చేయాలనుకుంటున్న విదేశీయులకు లబ్ధిచేకూర్చేలా ఆస్ట్రేలియా ప్రభుత్వం పలు నిబంధనలను సడలించింది. వీటి ప్రకారం.. ఒక్కో విద్యార్థి ఏడాదికి సగటున 40 వారాలు ఉద్యోగానికి కేటాయించవచ్చు. చదివే కోర్సును బట్టి ఈ నిబంధనల్లో కొద్దిపాటి మార్పులు ఉంటాయి. డిపార్ట్‌మెంటల్ స్టోర్లు, సూపర్ మార్కెట్లు, మాల్స్‌లో వంటి వాటిల్లో విద్యార్థులు పార్ట్‌టైంగా ఉపాధి పొందే వీలుంది. ట్యూషన్ టీచర్లు, క్లర్కులుగా కూడా ఉద్యోగాలు చేయచ్చు. ఇలా పార్ట్‌టైం ఉద్యోగాలు చేసే విద్యార్థులకు ప్రభుత్వం 2009లోనే కనీస వేతన చట్టాన్ని వర్తింపచేసింది.  ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని పలు రంగాలు ఉద్యోగుల కొరతతో సతమతమవుతున్న కారణంగా అక్కడి ప్రభుత్వం ఇటీవల వలసల విధానాలను మరింత సరళతరం చేసింది. వర్క్ పర్మిట్‌లకు సంబంధించిన నిబంధనలనూ సడలించిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.