ఆఖరి బంతికి 11 రన్స్‌ ఛేదించవచ్చు!

0
22

దుబాయ్‌: విజయం కోసం ఆఖరి బంతికి 11 పరుగులు? అంటే మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకోవడమే. కానీ, ఐసీసీ కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనల కారణంగా అసాధ్యం.. సుసాధ్యమయ్యే అవకాశం ఉంది. అదీ బౌలర్‌ వైడ్‌ లేదా నో బాల్‌ వేయకుండానే..! దీంతోపాటు క్రికెట్‌లో మరికొన్ని నియమాలను మార్చుతున్నట్టు ఐసీసీ మంగళవారం ప్రకటించింది. సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలోని క్రికెట్‌ కమిటీ చేసిన తాజా సిఫార్సులను చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఆమోదించింది. అక్టోబరు ఒకటి నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 

బౌలర్‌ బంతి వేయడానికి రనప్‌ అందుకొన్న సమయంలో.. ఫీల్డింగ్‌లో ఏదైనా ఉద్దేశపూర్వకమైన, అనైతిక కదలికలు చోటు చేసుకొంటే అంపైర్‌ ఆ బంతిని డెడ్‌ బాల్‌గా ప్రకటించవచ్చు. అంతేకాకుండా బ్యాటింగ్‌ చేస్తున్న జట్టుకు పెనాల్టీ రూపంలో 5 పరుగులు కేటాయించవచ్చు. అంటే చివరి బంతికి 11 పరుగులు కావాలంటే.. ఫీల్డింగ్‌ జట్టు తప్పిదంతో అదృష్టం కలసి వచ్చే అవకాశం ఉంది. 

కరోనా కారణంగా బంతికి ఉమ్మిరాయడంపై ఇప్పటిదాకా తాత్కాలికంగా నిషేధం అమల్లో ఉంది. ఇప్పుడు దీన్ని శాశ్వతం చేశారు. ఇకపై బంతికి ఉమ్మి రాయకూడదు. 

బ్యాటర్‌ క్యాచ్‌ అవుట్‌ అయితే.. స్ట్రయికర్‌ ఉన్న స్థానంలోకే కొత్త బ్యాటర్‌ వస్తాడు. క్యాచ్‌ పట్టే సమయంలో బ్యాటర్లు ఒకరినొకరు క్రాస్‌ చేసినా.. పరిగణనలోకి తీసుకోరు. 

టెస్టులు, వన్డేల్లో క్రీజులోకి వచ్చే బ్యాటర్‌ రెండు నిమిషాల్లోనే స్ట్రయిక్‌ తీసుకొనేందుకు సిద్ధం కావాలి. అది మించితే ఫీల్డింగ్‌ జట్టు టైమౌట్‌ అప్పీలు చేయవచ్చు. ఇప్పటిదాకా ఇది మూడు నిమిషాలుగా ఉంది. అయితే, టీ20ల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న 90 సెకన్ల వ్యవవధిలో ఎటువంటి మార్పూలేదు.

నాన్‌ స్ట్రయికర్‌ ఎండ్‌లో చేసే రనౌట్‌.. ‘మన్కడింగ్‌’ను అన్‌ ఫెయిర్‌ప్లే సెక్షన్‌ నుంచి రెగ్యులర్‌ రనౌట్‌ సెక్షన్‌కు మార్చారు. 

బౌలర్‌ బంతి వేయకముందే.. బ్యాటర్‌ క్రీజు బయటకు వచ్చి ఆడేందుకు ప్రయత్నిస్తే.. బౌలర్‌ బంతిని విసిరి రనౌట్‌కు ప్రయత్నించే అవకాశం ఉంది. కానీ, ఇకమీదట అలా చేస్తే డెడ్‌ బాల్‌గా ప్రకటిస్తారు. 

బంతిని ఆడేటప్పుడు బ్యాటర్‌ బ్యాట్‌లో కొంత భాగం లేదా అతడి శరీరం పిచ్‌పైనే ఉండాలి. అలా కాకుండా పిచ్‌ బయటకు వచ్చి ఆడితే.. దాన్ని డెడ్‌ బాల్‌గా పరిగణిస్తారు. ఒకవేళ బౌలర్‌ వేసిన బంతి.. బ్యాటర్‌ను పిచ్‌ బయటకు రప్పించేలా ఉంటే.. దాన్ని నోబాల్‌గా ప్రకటిస్తారు. 

టీ20 క్రికెట్‌లో అమల్లో ఉన్న స్లో ఓవర్‌ రేట్‌ నిబంధనను వన్డేల్లో కూడా అమలు చేయనున్నారు. నిర్ణీత సమయంలో బౌలింగ్‌ జట్టు కోటా ఓవర్లను పూర్తి చేయలేకపోతే.. ఆ మిగిలిన ఓవర్లలో ఓ ఫీల్డర్‌ను బౌండ్రీ దగ్గర నుంచి 30 యార్డ్‌ సర్కిల్‌లోకి తీసుకురావాల్సి ఉంటుంది. అంటే.. ఏదైనా జట్టు నిర్ణీత సమయంలో 48 ఓవర్లు మాత్రమే పూర్తి చేస్తే.. మిగతా రెండు ఓవర్లపాటు రింగ్‌ బయట నలుగురు ఫీల్డర్లకు మాత్రమే అనుమతి. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్‌ సూపర్‌ లీగ్‌ ముగిసిన తర్వాత నుంచి ఈ రూల్‌ అమల్లోకి రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.